Friday, March 29, 2024
HomeTrending Newsసంక్షేమ పథకాలపై మోడీకి అక్కసు - కేటిఆర్

సంక్షేమ పథకాలపై మోడీకి అక్కసు – కేటిఆర్

ఉచిత పథకాలు వద్దంటూ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యల పైన మంత్రి కేటీఆర్ శనివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, మోడీ పాలనపై మంత్రి కేటిఆర్ పదునైన విమర్శలు చేశారు.

ఇటీవల ప్రధాని మోడీ గారు అవకాశం దొరికినప్పుడల్లా ఫ్రీబీ (రేవ్డీ) కల్చర్ గురించి మాట్లాడుతున్నారు. అయన మాటలు వింటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎనిమిదేళ్ల పాలనలో దేశ ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి, సామాన్యుడి బతుకు భారం చేసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు పేదవాడి పొట్టకొట్టడానికి వేసిన కొత్త పాచిక ఈ ఉచిత పథకాల మీద చర్చ!

ఓవైపు పాలు, పెరుగు లాంటి నిత్యావసర వస్తువుల మీద కూడా జీఎస్టీ పన్ను వేసి సామాన్యుల రక్తాన్ని జలగల్లా జుర్రుకునే ప్రణాళికలు అమలుచేస్తున్నదీ కేంద్ర బీజేపీ సర్కార్. మరోవైపు దేశంలోని పేద ప్రజల నోటి కాడి కూడును లాగేసే దుర్మార్గానికి తెగించింది.

ఎనిమిదేళ్ల మోడీ పాలనలో దేశంలో పేదరికం పెచ్చుమీరి ఇప్పుడు నైజీరియా కన్నా ఎక్కువమంది పేదలున్న దేశంగా అపకీర్తిని గడించాం.

వరల్డ్ హంగర్ ఇండెక్స్ (ఆకలి సూచి)లో నానాటికి దిగజారి 116 దేశాల్లో 101వ స్థానానికి చేరుకున్నాం. దేశంలో పుట్టిన పిల్లల్లో 35.5% మంది పోషకాహార లోపంతో పెరుగుదల సరిగ్గా లేదని కేంద్రం విడుదల చేసిన గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.

మోడికి ముందున్న 14 మంది ప్రధానులు కలిసి రు. 56 లక్షల కోట్ల అప్పుచేస్తే, మోడి ఒక్కరే సుమారు 80 లక్షల కోట్లకు పైగా అప్పుచేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే దేశ వార్షిక రాబడిలో 37% ఖర్చు అవుతున్నదని మొన్ననే కాగ్ తీవ్ర హెచ్చరిక చేసింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం కేంద్రప్రభుత్వం జీడీపీలో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదని కానీ, మోదీ సర్కారు ఇప్పటికే 54 శాతం అప్పులు చేసిందని కాగ్ తలంటింది. పరిస్థితి ఇలాగే పోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉన్నదని కాగ్ హెచ్చరించింది

మరి ఇంత సొమ్ము అప్పుగా తెచ్చిన మోడి ఆ డబ్బును ఏ వర్గాల ప్రయోజనాల కోసం ఖర్చుచేశారో చెప్పాలె. తెచ్చిన ఆ అప్పుతో ఒక్క భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిండ్రా, మరేదైనా జాతీయ స్థాయి నిర్మాణం చేసిండ్రా? పోనీ పేదల కడుపునింపే ఒక్క సంక్షేమ పథకమైనా తెచ్చిండ్రా?

ఇవేవీ చేయనప్పుడు మరి ఇన్ని లక్షల కోట్లు ఎవరి బొక్కసాలకు చేరిందో ఆయనే చెప్పాలె.

లక్షల కోట్ల అప్పులు తెస్తారు, దానితో ప్రజోపయోగ పనులు చేయరు, ఉల్టా వాళ్లే పేదవాడి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా పథకాలు పెడితే వాటి మీద ఫ్రీబీ కల్చర్ అంటూ విషం చిమ్ముతారు.

మన రాజ్యంగంలో రాసుకున్న ప్రకారం భారత దేశం ఒక “సంక్షేమ రాజ్యం” అని నేను ప్రధానమంత్రికి గుర్తుచేయదలిచాను.

భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు రాజ్యం (ప్రభుత్వం) ప్రజల శ్రేయస్సు కొరకు, సామాజికాభివృద్ధి కొరకు పాటుపడుతూ, ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందించేందుకు ఎల్లవేళలా పనిచేస్తుందని పౌరులకు భరోసా ఇస్తాయి.

ఆదేశిక సూత్రాల ప్రకారం భారత ప్రభుత్వం తన పౌరులందరికీ స్త్రీ పురుష వివక్ష లేకుండా సమానంగా జీవనోపాధి కల్పించాలి. సంపద ఒక దగ్గరే కేంద్రీకృతం కాకుండా, ప్రజలందరిలో పంపిణీ జరిగేలా చూడాలి. గ్రామపంచాయతీలకు ప్రోత్సాహకాలిచ్చి, స్వయంపాలన చేసుకోగలిగే పరిస్థితులను రాజ్యం కల్పించాలి. నిరుద్యోగులు, వృద్ధులు, అనారోగ్య పీడితులు, దిక్కు లేని వారి కోసం రాజ్యమే కనీస వసతులను కల్పించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల విద్య, ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి కొరకు రాజ్యం పాటుపడాలి. ప్రజాసంక్షేమానికి అవసరమైన ఇంకా అనేక విషయాలను ఆదేశిక సూత్రాలలో పొందుపరిచారు. వీటి సాధనకు రాజ్యం నిరంతరం కృషి చేయాల్సి ఉంటుంది.

కానీ, 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో మనదేశం ఈ ఆదేశికసూత్రాల అమలులో ఎంతో వెనుకబడి ఉన్నదనేది చేదు నిజం.

ఇంతకూ ప్రధాని మోడీ ఉచితాలు అంటూ వెక్కిరిస్తున్నది ఏ పథకాలను?

దశాబ్దాలుగా ప్రకృతి ప్రకోపానికి గురై, గిట్టుబాటు ధరలేక, అప్పులపాలై ఉసురుదీసుకుంటున్న రైత్ననకు ఇస్తున్న ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలనేనా మోడి గారు ఇవ్వొద్దు అంటున్నది?

అయినా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి రైతులను 13 నెలల పాటు రోడ్ల మీదకు తెచ్చి, అరిగోస పెట్టి 700 పైచిలుకు రైతుల బలవన్మరణానికి కారణమైన మీకు రైతు సంక్షేమం అనే మాటకు కూడా అర్థం తెలియదు!

వ్యవసాయ రంగాన్ని విస్మరించడంతో పాటు దేశ రైతులపై ఆర్థిక భారం మోపే నిర్ణయాలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుత బడ్జెట్‌లో రసాయనిక ఎరువులపై ఇస్తున్న సబ్సిడీలకు భారీగా కోత విధించడంతో ఎరువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అసలే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఇది పెనుభారం అవుతుంది అన్న సంగతి మీ రైతు వ్యతిరేక ప్రభుత్వానికి ఎప్పటికి అర్థం అవుతుంది మోడీ గారూ?

ఈ దేశంలో అత్యంత పేదలుగా ఉన్న బిసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన బడుగులకు ఒక్క రూపాయికే కిలో బియ్యం ఇవ్వడం మీదనేనా మీ అక్కసు మోడీ గారూ?

బడుగు, బలహీన వర్గాల పిల్లలకు స్కూళ్లలో ఉచితంగా భోజనం పెట్టడం మీదనేనా మీ కండ్ల మంట మోడీ గారూ? గురుకుల స్కూళ్లు పెట్టి పేద బిడ్డలకు ఉచిత వసతులిచ్చి వారిని మెరికల్లాగా తీర్చిదిద్దడం మీరు నిషేధిస్తారా ఇక?

మన భావితరం పోషకాహార లోపంతో కునారిల్లకుండా ఉండటానికి గర్భిణి స్త్రీలకు ఆరోగ్య లక్ష్మి వంటి పథకాల ద్వారా పోషకాహారం అందించడం, అమ్మఒడి 102 వాహనాల్లో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి, ప్రసూతి తరువాత పుట్టిన బిడ్డ సంరక్షణ కోసం కేసీఆర్ కిట్ ఇవ్వడం, 13,000 నగదు సహాయం చేయడం మీ దృష్టిలో వృధా ఖర్చా మోడీ గారూ?

తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక, ఉన్న నీళ్లు ఫ్లోరైడ్ విషంతో బొక్కలు అరగదీసిన గడ్డ మీద మిషన్ భగీరథ పథకం పెట్టి ఉచితంగా మంచి నీరు ఇవ్వడం మీకు రుచించడం లేదా మోడీ గారూ?

మానవ మనుగడకు వ్యవసాయం తరువాత అత్యంత అవసరమైన నేతన్న చేతిలో చిల్లిగవ్వ లేక నేసిన దారాలే ఉరిపోగులుగా మారుతున్న సంక్షోభ సమయంలో వారిని ఆదుకోవడానికి నేతన్నకు చేయూత, నేతన్నకు బీమా, బతుకమ్మ చీరల వంటి పథకాలు పెట్టడం కూడా తప్పు అనడం ఏం న్యాయం మోడీ గారూ?

పేదింటి బిడ్డకు పెళ్లిచేయడం ఆ తల్లితండ్రులకు భారం కావద్దు అని కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ వంటి పథకాలు తెచ్చి పేదవారింట సంతోషం వెల్లివిరిసేలా చేయడం ఇకపై కొనసాగవద్దు అంటున్నారా మోడీ గారూ?

వేల ఏండ్లుగా వివక్షకు గురైన సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికోసం తెచ్చిన దళితబంధు పథకం అవసరం లేదంటున్నారా మోడిగారూ?

గత అయిదేళ్లలో వంట గ్యాస్ సిలిండర్ కూడా రీఫిల్ చేయించుకోలేని ప్రజల సంఖ్య 4.13 కోట్లు. కేవలం ఒక్క సిలిండర్ మాత్రమే కొనగలిగిన వారి సంఖ్య 7.67 కోట్లు. నిజాలు ఇలా ఉంటే గ్యాస్ సబ్సిడీని ఎత్తేయాలనే మీ దుర్మార్గమైన ఆలోచన ఎంతమంది పేదలను ఆకలిమంటల్లోకి పడదోస్తున్నదో ఎన్నడైనా ఆలోచించారా మీరు?

కోవిడ్ మహమ్మారి సమయంలో లక్షలాది మంది వలస కార్మికులు భీతావహులై పొట్టచేతబట్టుకుని, ఆకలితో అలమటిస్తూ పిల్లా పాపలతో కలిసి స్వస్థలాలకు కాలి నడకన పయనిస్తుంటే, వారి వద్ద కూడా ముక్కుపిండి రైలు టికెట్ చార్జీలు వసూలు చేసిన పాషాణ హృదయపు ప్రభుత్వం మీది.

సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లలో రాయితీ ఉండదని ప్రకటించడానికి మీ ప్రభుత్వానికి మనసెలా వచ్చింది మోడీ గారూ? కోట్లాది మంది వయో వృద్ధులకు మ‌న స‌హాయ‌, స‌హ‌కారాలు అవ‌స‌రం. వారిని మనం గౌర‌వించుకోవాలి. మీ మిత్రులైన బడా పారిశ్రామిక వేత్తలకు వేల కోట్ల పన్ను రాయితీలు ఇస్తున్న మీ ప్రభుత్వం దగ్గర దేశంలోని సీనియర్‌ సిటిజెన్లకు రైలు టికెట్లలో రాయితీ కోసం 1500 కోట్లు కేటాయించడానికి చేతులు రావట్లేదా మోడీజీ?

పేద రైతన్నకు రుణమాఫీ చేస్తే ఉచితాలు తప్పు అని ఘోషించే మీరు మరి అదే సమయంలో ఈ దేశపు కార్పొరేట్ పెద్దలకు మాత్రం అందినకాడికి దోచిపెడుతున్నారు. గత మూడేళ్లలోనే సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ ట్యాక్స్ రాయితీలు ఇచ్చింది ఘనత వహించిన మీ ప్రభుత్వం. బడా బాబులకు 10 లక్షల కోట్లకు పైగా బ్యాంకు అప్పులు సైలెంటుగా రైట్ ఆఫ్ చేసిన మీ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతుల అప్పుల విషయానికి వచ్చేసరికి మీ స్వరం మారిపోతుంది.

కాకులను కొట్టి గద్దలకు వేయడమేనా మీ విధానం మోడి గారూ?

సామాన్యుడి కడుపుగొట్టి, కార్పొరేట్లకు లబ్ది చేకూర్చడమేనా మీ విధానం మోడి గారూ?

అయినా ఇన్ని మాటలొద్దు గానీ, ప్రజా సంక్షేమం మీద మీ విధానం ఏమిటో ఈ దేశ ప్రజలకు స్పష్టం చేయండి. దాని మీద చర్చ పెట్టండి.

మీ ఎనిమిదేళ్ళ పాలనలో బడా బాబులకు మాఫీ చేసిన/ఎగ్గొట్టిన రుణాలు ఎన్ని? రైతన్నకు మాఫీ చేసిన రుణాలు ఎన్ని?

– మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలు రద్దు చేస్తారా చెప్పండి

– పేదలకు, రైతులకు, బడుగు బలహీనవర్గాల ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాల మీద మీ బీజేపీ పార్టీ వైఖరి స్పష్టపరచండి

– వచ్చే ఎన్నికల్లో ఈ ఉచిత సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తామని ప్రకటించి ఎన్నికలకు వెళతారా చెప్పండి

– ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో, కేంద్ర ప్రభుత్వం పరిధిలో అమలవుతున్న ఉచిత సంక్షేమ పథకాలన్నీ రద్దు చేయడానికి పార్లమెంటులో చట్టం కానీ, రాజ్యాంగ సవరణ గానీ చేస్తారా దేశప్రజలకు చెప్పండి.

సంపద పెంచాలె – పేదలకు పంచాలె అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నినాదం. కానీ మీకు మాత్రం సంపద పెంచడం చేతకాదు. పేదలకు సంక్షేమం కోసం దాని ఖర్చు చేయడానికి మనసు రాదు.

దేశం స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ రేపు ఎర్ర కోట మీద త్రివర్ణ పతాకం ఎగురవేశాక జాతినుద్దేశించి మీరు చేసే ప్రసంగంలో పేదల సంక్షేమం కొరకు చేపట్టిన పథకాల మీద మీ వైఖరి ఏమిటో స్పష్టం చేయండి. మీ దృష్టిలో ఏది ఉచితమో, ఏది అనుచితమో ఈ దేశ ప్రజలకు వెల్లడి చేస్తారని ఆశిస్తున్నాను!

RELATED ARTICLES

Most Popular

న్యూస్