వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రాణ రక్షణ రక్షణ బాధ్యతను రాష్ట్ర డిజిపి తీసుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో కేంద్ర హోం శాఖకు లేఖ రాసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక లేఖను విడుదల చేశారు. తనకు ప్రాణ హాని ఉందని ఆనం ఆందోళన చెందడం రాష్ట్రంలో నెలకొన్న ప్రతీకార రాజకీయాలకు పరాకాష్ట అంటూ అభివర్ణించారు.
తాము నెల్లూరులో నివసించినప్పటినుంచీ ఆనం కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పవన్ గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ వ్యవహార శైలి గురించి, తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం గురించి తన అభిప్రాయాలు వెల్లడించడమే ఆనం చేసిన నేరమా అంటూ ప్రశ్నించారు. ఆనం లాంటి సీనియర్ ఎమ్మెల్యేనే ఆందోళన చెందుతుంటే ఇంకా మిగిలిన ప్రజా ప్రతినిధుల పరిస్థితి ఏమిటని సూటిగా ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలు స్వేచ్చగా మాట్లాడుకునే పరిస్థితి లేదని, ఫోన్ ట్యాపింగ్ పై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై రాష్ట్ర హోం మంత్రి గానీ, డిజిపి గానీ ఎందుకు మాట్లాడడం లేదని పవన్ నిలదీశారు.