తనను ఉద్దేశించి టిడిపి నేత అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉంది, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఒక్కదాన్ని కూడా తెచ్చుకోలేకపోయిన నువ్వు దద్దమ్మవా నేనా అంటూ ఎదురు దాడి చేశారు. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అచ్చెన్న జై కొట్టారని, విశాఖను పరిపాలనా రాజధాని చేస్తుంటే అడ్డు పడుతున్నారని ధర్మాన మండిపడ్డారు. శ్రీకాకుళంలో పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంపై అచ్చెన్న ఏనాడూ ప్రశ్నించలేదని, దద్దమ్మ ఎవరో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. అభివృద్ధి అంతా ఓకే ప్రాంతంలో కేంద్రీకరించి వెనుకబడిన ప్రాంతాలను ఇంకా నిర్లక్ష్యం చేస్తామంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిఎం జగన్ ప్రతిపాదించిన అభ్యర్ధి సీతంరాజు సుధాకర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ధర్మాన విజ్ఞప్తి చేశారు. ఈ జిల్లాలో ఉన్న ప్రతి పౌరుడూ విశాఖ పాలనా రాజధానికి మద్దతు తెలపాలని, దానికోసం ఎమ్మెల్సీ ఎన్నికలను వినియోగించుకోవాలని కోరారు.