సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ కథకులు జి.వల్లీశ్వర్ రచించిన ’99 సెకన్ల కథలు’ పుస్తకాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆవిష్కరించారు. శ్రీకాకుళంలోని నాగావళి హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో వల్లీశ్వర్ కథా సాహిత్య రీతిని ధర్మాన వివరిస్తూ విశ్లేషించారు. ఆధునిక కథ మరింత కొత్త పుంతలు తొక్కాలని ఆకాంక్షించారు. ధర్మాన ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ పుస్తకాన్ని వెలువరించారు.
ధర్మాన మాట్లాడుతూ.. వైఎస్సార్ హయాంలో చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా పనిచేసిన వల్లీశ్వర్ నిబద్ధత ఉన్న జర్నలిస్టు అని కొనియాడారు. 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. నియమ, నిబంధనలు కలిగిన వల్లీశ్వర్ లాంటి వారు సమాజంలో సమున్నత రీతిలో గౌరవం అందుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఇటువంటి రచయితల వల్ల సమాజానికి మేలు జరుగుతుందని చెప్పారు. తాజా పుస్తకంలో ప్రతి కథ మనల్ని హెచ్చరిస్తుందని, ఆలోచింపజేస్తుందని అన్నారు. సమాజరీతికి దర్పణం పట్టే రీతిలో ఉంటుందని చెప్పారు. ఉన్నత స్థాయి ప్రమాణాలతో పనిచేసిన వైనం ఆయనకే సొంతం అని చెప్పారు. దివంగత సీఎం వైఎస్ తో కలిసి పనిచేసి, సమర్థుడయిన అధికారిగా పేరు తెచ్చుకున్నారని కితాబిచ్చారు. కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.
రామకృష్ణమఠం కె.వి.ఎన్ మూర్తి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, రచయిత అట్టాడ అప్పలనాయుడు, ఉపనిషన్మందిరం నిష్టల నరసింహమూర్తి, సీనియర్ పాత్రికేయులు శశాంక మోహన్, జంధ్యాల శరత్ బాబు, ప్రయోక్త జామి భీమ శంకరరావు తదితరులు పాల్గొన్నారు