చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సారధ్య బాధ్యతల నుంచి మహేందర్ సింగ్ ధోని తప్పుకున్నాడు. కొత్త కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ ను నియమిస్తున్నట్లు సీఎస్కే యాజమాన్యం ప్రకటించింది. మరో రెండు రోజుల్లో ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న సమయంలో ధోని తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.
గతంలో 2022 ఐపీఎల్ సీజన్ కు రెండ్రోజుల ముందు ధోని కెప్టెన్సీని వదులుకున్నాడు. ఆ సమయంలో జడేజాకు బాధ్యతలు అప్పగించారు. కానీ జట్టు వరుస వైఫల్యాలతో ఎనిమిది మ్యాచ్ ల తరువాత జడేజా తప్పుకున్నాడు. మళ్ళీ దోనీ జట్టు బాధ్యతలు చేపట్టాడు. ఈసారి సీజన్ ప్రారంభానికి ముందే ధోని బాధ్యతల నుంచి నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్ల ఫోటోషూట్ కూడా ధోని హాజరు కాలేదు.
42 సంవత్సరాల ధోనీ ఈసారి ఐపీఎల్ ఆడతాడా లేదా అనే అనుమానాలు కూడా తలెత్తాయి, కానీ ఇటీవలి ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో తన ఫిట్నెస్ పూర్తిగా నిరూపించుకున్నారు. గత ఏడాది ఫైనల్లో అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో చెన్నై…చివరి బంతికి మ్యాచ్ గెలిచి విజేతగా నిలిచింది. అప్పుడే వచ్చే సీజన్ కూడా ఆడతానని ధోనీ ప్రకటించాడు. అయితే వయసు రీత్యా ఇది సాధ్యమేనా కాదా అనే అనుమానాలకు తెర దించుతూ దోనీ బరిలోకి దిగుతున్నాడు.