Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఐపీఎల్: రాజస్థాన్ జోరుకు బెంగుళూరు బ్రేక్

ఐపీఎల్: రాజస్థాన్ జోరుకు బెంగుళూరు బ్రేక్

RCB won: ఐపీఎల్ ఈ సీజన్లో రెండు వరస విజయాలతో జోరు మీదున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బ్రేక్ వేసింది. ఓ దశలో రాజస్థాన్ గెలుపు లాంఛనమే అని అనుకున్న తరుణంలో షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ తమ బ్యాటింగ్ తో రాజస్థాన్ ఆశలు అడియాశలు చేసి బెంగుళూరుకు నాలుగు వికెట్లతో అపూర్వ విజయం అందించారు.

ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ ఆరు పరుగులకే తొలి వికెట్ (యశస్వి జైస్వాల్-4) కోల్పోయింది. మరో ఓపెనర్ జోస్ బట్లర్-దేవదత్ పడిక్కల్ రెండో వికెట్ కు 70 పరుగులు జోడించారు. పడిక్కల్ 37 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ సంజూ శ్యామ్సన్ కేవలం 8 పరుగులకే వెనుదిరిగాడు. బట్లర్- హెట్మెయిర్ నాలుగో వికెట్ కు 83 పరుగులు జోడించి అజేయంగా నిలిచారు. బట్లర్ 47బంతుల్లో 6 సిక్సర్లతో 70;  హెట్మెయిర్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసింది. బెంగుళూరు బౌలర్లలో డేవిడ్ విల్లె, హసరంగ, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ సాధించారు.

ఆర్సీబీ ఇన్నింగ్స్ ను ధాటిగానే ఆరంభించి తొలి వికెట్ కు 55 పరుగులు జోడించింది. కెప్టెన్ డూప్లెసిస్ 29 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే 61 వద్ద మరో ఓపెనర్ అర్జున్ రావత్ (26) కూడా ఔట్ కాగా, 62 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు (కోహ్లీ-5; డేవిడ్ విల్లె డకౌట్) కోల్పోయింది. రూథర్ ఫర్డ్ కూడా కేవలం ఐదు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. 87 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన దశలో షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ రాజస్థాన్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని ఆరో వికెట్ కు 67 పరుగులు జోడించారు. షాబాజ్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు.  తర్వాత వచ్చిన హర్షల్ పటేల్ దినేష్ కు అండగా నిలిచాడు. దినేష్ కార్తీక్ (23 బంతులు, 7 ఫోర్లు, 1 సిక్సర్) 44 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్లో మూడు పరుగులు అవసరం కాగా హర్షల్ తొలి బంతినే సిక్సర్ గా మలిచి మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయం ఖాయం చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, చాహల్ చెరో రెండు; నవదీప్ షైనీ ఒక వికెట్ పడగొట్టారు.

దినేష్ కార్తీక్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

Also Read : ఐపీఎల్: హైదరాబాద్ కు రెండో ఓటమి

RELATED ARTICLES

Most Popular

న్యూస్