Tuesday, April 16, 2024
HomeTrending Newsమహారాజపురం విశ్వనాథ అయ్యర్

మహారాజపురం విశ్వనాథ అయ్యర్

Viswanatha Iyer : తమిళనాడులోని తంజావూరు కావేరీ నదీ తీరాన ఉన్న ప్రాంతమైన మహారాజపురమే విశ్వనాథ అయ్యర్ పూర్వీకులది. రామ అయ్యర్, అంబై దంపతుల సుపుత్రుడే ఈయన. రామ అయ్యర్ కాశీ క్షేత్రానికి వెళ్ళిన సమయంలో జన్మించడం వల్ల తన కుమారుడికి (కాశీ) విశ్వనాథన్ అని నామకరణం చేశారు. విశ్వనాథన్ తండ్రి రామ అయ్యర్ కీర్తనలు పాడేవారు. ఆయన రాగాలాపనలకు పెట్టింది పేరు. శ్లోకాలను రాగమాలికలుగా ఆలపించేవారు. విశ్వనాథన్ తొలి గురువు ఉమయాళ్ పురం స్వామినాథ అయ్యర్. ఆయన వద్ద పది వర్ణాలు, ఇరవై కృతులూ నేర్చుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన దగ్గర శిక్షణ కొనసాగించ లేకపోవడానికి కారణం తండ్రి డబ్బులు చెల్లించలేకపోవడమే.

ఓరోజున విశ్వనాథ అయ్యర్ మహామఖం పుష్కరిణి దగ్గర కూర్చున్నప్పుడు ఓ మనిషి ఆయన దగ్గరకు వచ్చి ఆయన పక్కనే కూర్చున్నారు. ఆ మనిషి తనంతట తానే విశ్వనాథన్ కి సంగీత స్వరాలకు సంబంధించి కొన్ని పాఠాలు చెప్పి స్వరం ఎలా కాపాడుకోవాలో చెప్పారు. అనంతరం ఘటం విద్వాంసుడైన పళని రంగప్ప లయ జ్ఞానం నేర్పించారు. కొద్ది రోజులకే విశ్వనాథన్ తనకొచ్చిన గాత్ర సంగీతాన్ని ప్రదర్శించే అదృష్టం కలిగింది. ఈయన గాత్రానికి పొన్నుస్వామి పిళ్ళయ్ వయోలిన్ మీద, దక్షిణామూర్తి పిళ్ళయ్ మృదంగం మీద సహకరించారు. పళని ముత్తయ్య పిళ్ళయ్ దగ్గర లయ జ్ఞానానికి సంబంధించి ఆయన మరిన్ని మెరుగులు పెట్టుకున్నారు. ఇద్దరూ కలిసి పొద్దున్నే ఓ కొలను దగ్గరకు వెళ్ళేవారు. నూనె మర్దనం చేసుకుని షీకాయ్ పిండితో స్నానం చేసేవారు. మధ్యాహ్నం వరకూ అక్కడే ఉండి సాధన చేసేవారు. ఈ క్రమంలో ఆయన శృతిపై గట్టి పట్టు సంపాదించారు.

విశ్వానథన్ తొలి కచేరీ విచిత్రంగా జరిగింది.
టి. పంజాబకేశ భాగవతార్ నిర్వహించిన రామ నవమి ఉత్సవాలకు ఆయన వెళ్లారు. అప్పట్లో విశ్వనాథన్ ఎవరో, ఆయన ఎవరి దగ్గర శిష్యరికం చేశారో తెలుసు. భాగవతార్ విరామ సమయంలో విశ్వనాథన్‌ని కావాలనే పాడమని కోరారు. విశ్వనాథన్ సరేనని నాలుగు రాగాలలో నాలుగు కీర్తనలు పాడారు. అదీ ఆయన మొదటిసారిగా వేదికపై పాడటం. ఆయన 1911లో కుంభకోణంలో అయిదో జార్జ్ ప్రభువు పట్టాభిషేకం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కచేరీ చేసినప్పుడు ఈ కార్యక్రమానికి ఆయన తొలి గురువు ఉమయాళ్పురం శ్రీనివాస అయ్యర్ హాజరయ్యారు.

అనతికాలంలోనే ఆయన తనకంటూ ఓ గుర్తింపు పొందారు. అందరూ ఆయనను జునియర్ పుష్పవనం అని పిలిచేవారు. అప్పటి సంగిత విద్వాంసులలో ఒకరైన మదురై పుష్పవనం అయ్యర్ తో ఆయనను పోల్చేవారు. ఆయనను ప్రభావితం చేసిన వారిలో హిందుస్తానీ సంగీత విద్వాంసుడు అబ్దుల్ కరీం ఖాన్ ఒకరు. అందుకే విశ్వనాథన్ రాగాలాపనలలో హిందుస్థానీ బాణీలు కూడా ఉండేవి. ప్రత్యేకించి ఆయన మోహన రాగంలో ఆలాపన చేసేటప్పుడు అందులో హిందుస్థానీ భూప్ ఛాయలుండేవని అనుకునేవారు. పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలలో ఆయన పాడిన పాటలు గ్రామఫోన్ రికార్డులుగా వెలువడ్డాయి. ఆయనకు అత్యంత ఇష్టమైన రాగం మోహనం. ఆయన కచేరీలలో త్యాగరాజు, ముత్తుసామి, శ్యామాశాస్త్రి, పట్నం సుబ్రమణ్యం కీర్తనలు, గోపాల కృష్ణ భారతి తమిళ పాటలు ఎక్కువగా పాడుతుండేవారు.

1927 ప్రాంతంలో విశ్వనాథ అయ్యర్ గాత్రం దెబ్బతింది. దీంతో ఆయన తిరిగి 1937లో పాడటం మొదలుపెట్టారు. సంగీత పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. ఆయన వద్ద తర్ఫీదు పొందిన వారిలో సెమ్మంగుడి, టి. ఆర్. నవనీతన్, మన్నార్గుడి సాంబశివ భాగవతార్ తదితరులున్నారు. ఆయన దగ్గర శిక్షణ పొంది తనకంటూ ఓ గుర్తింపు పొంది పలు కచేరీలతో పేరుప్రఖ్యాతులు సంపాదించిన వారిలో కొడుకు సంతానం ఒకరు. ఇక్కడో విషయం చెప్పాలి. నేను మద్రాసులోని టీ. నగర్లో గిరిఫిత్ రోడ్డులో ఉన్న శ్రీ రామకృష్ణామిషన్ ఎలిమెంటరీ స్కూల్లో అయిదు తరగతుల వరకూ చదువుకున్నాను. ఆ వీధికి మహారాజపురం సంతానం రోడ్డు అని పేరు మార్చారు. ఆ మహారాజపురం సంతానం ఈయనే. ఈయన కచేరీని నేను అదే రోడ్డులో ఉన్న కృష్ణగానసభలో ప్రత్యక్షంగా చూశాను.

1935లో విశ్వనాథన్ భక్త నందనార్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో నందనార్ గా కె.బి. సుందరాంబాళ్ నటించారు. 1939లో తంజావూరులో ఆయనను ఘనంగా సత్కరించి సంగీత భూపతి బిరుదు ప్రదానం చేశారు. 1945లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఆయనను సంగీత కళానిధి టైటిల్ తో సత్కరించింది. మైసూరు, పుదుక్కోట్టయ్, ట్రావన్కోర్ ఆస్థాన విద్వాంసుడిగా ఉండిన ఆయన 1955లో సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు.

త్యాగరాజుపై ఉన్న భక్తిభావంతో ఆయన సమాధికి దగ్గర్లోనే గడపాలనుకుని త్యాగరాజు నివసించిన ఇంటికి పక్కనే ఓ ఇల్లు కొనుగోలు చేసిన విశ్వనాథ అయ్యర్ అక్కడే గడిపారు. ఈ వీధిని తిరుమంజన వీధిగా పిలుస్తారు. వయోభారంతోనూ అనారోగ్యంతోనూ బాధపడుతున్న ఈయన 1968లో కొడుకు సంతానం బలవంతంతో తిరిగి మద్రాసుకు రావలసి వచ్చింది. 1896లో జన్మించిన మహారాజపురం విశ్వనాథన్ 1970లో తుదిశ్వాస విడిచారు.

మహారాజపురం విశ్వనాథన్ జ్ఞాపకార్థం ఆయన మనవడు మహారాజపురం శ్రీనివాసన్ ఒక ఫౌండేషన్ స్థాపించారు. ప్రతి ఏటా తన తాతగారి పేరిట సంగీత విద్వాంసుడికి ఫౌండేషన్ తరపున స్వర్ణపతకంతోపాటు పారితోషికంతో సన్మానిస్తుండటం విశేషం.

– యామిజాల జగదీశ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్