ప్రవీణ్ సత్తారు అనే పేరు వినగానే ‘గరుడ వేగ’ అనే ఒక భారీ యాక్షన్ సినిమా కళ్లముందు కదలాడుతుంది. ఆ సినిమా భారీ వసూళ్లను సాధించింది. అయినా ఆయన తొందరపడకుండా కాస్త గ్యాప్ తీసుకునే మరో యాక్షన్ సినిమాకి అవసరమైన కథను రెడీ చేసుకుని రంగంలోకి దిగాడు. ఆ సినిమా పేరే ‘గాండీవధారి అర్జున’. వరుణ్ తేజ్ హీరోగా ఆయన ఈ సినిమాను రూపొందించాడు. మేకింగ్ లో తన మార్కు ఎక్కడా మిస్స్వ్వకుండా ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాడు.
నిన్న రాత్రి జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ, వరుణ్ తేజ్ పై ప్రశంసలు కురిపించాడు. మొదటి నుంచి కూడా వరుణ్ తేజ్ కథ ప్రధానమైన సినిమాలనే ఎంచుకుంటూ వెళుతున్నాడనీ, అదే ఆయన ప్రత్యేకతగా నిలిచిందని అన్నాడు. అందువల్లనే ఈ కథకు ఆయనను హీరోగా ఎంపిక చేసుకోవడం జరిగిందని చెప్పాడు. ఈ సినిమా చూసినవారికి ఈ కథకి ఆయనే కరెక్టు అనిపిస్తుందని అన్నాడు.
ఈ సినిమా షూటింగును అనుకున్న దానికంటే 20 రోజుల ముందుగానే పూర్తి చేశామనీ, అందుకు కారణం వరుణ్ తేజ్ అని చెప్పాడు. దాదాపు ఈ సినిమాను విదేశాల్లోనే షూట్ చేశామనీ, అక్కడి చలిని .. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా వరుణ్ షూటింగులో పాల్గొన్నాడని చెప్పాడు.తాను అనుకున్నట్టుగా ఈ సినిమా రావడానికి కారకుడు వరుణ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనీ, తప్పకుండా ఇది ఆయన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.