రామక్రిష్ణ, హరిక్రిష్ణ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘తికమక తాండ’. ప్రొడ్యూసర్ తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. గౌతమ్‌మీనన్, చేరన్, విక్రమ్ కె.కుమార్ వంటి దర్శకుల దగ్గరర కో డైరెక్టర్ గా పని చేసిన వెంకట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో చిత్రాల్లో బాల నటిగా అలరించిన ఆని కథానాయికగా పరిచయమవుతోంది. రామక్రిష్ణ, హరిక్రిష్ణ ఇద్దరు కవలలు హీరోలుగా నటించడం విశేషం.
దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ ‘‘1990లో గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. సమాజంలో ఎప్పటినుండో ఉన్న ఒక సమస్య, ఆ సమస్య వల్ల ఒక గ్రామం అంతా మతిమరుపు సమస్యతో బాధపడుతుంటారు. ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారనే సామాజిక అంశంతో ఈచిత్రం తెరకెక్కుతోంది. వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామంలో అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ చేశాం. రామక్రిష్ణ, హరిక్రిష్ణ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఆని నటన ఈ చిత్రానికి ప్రత్యేకంగా నిలుస్తుంది. కెమెరామెన్ పనితీరు హైలైట్‌గా నిలుస్తుంది’’ అని తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘ అర్ధవంతమైన చిత్రాలు చేయాలని సినిమాల్లోకి వచ్చా. తొలి చిత్రానికి మంచి కథ కుదిరింది. నిరూప్ కుమార్ ఇచ్చిన కథ, వెంకట్ ఎగ్జిక్యూషన్‌కు ఫిదా అయ్యి ఈ సినిమా చేస్తున్నా. మాటలు, సన్నివేశాలు ఎక్కడ అసభ్యత లేని కథ ఇది. కుటుంబ ప్రేక్షకులతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుంది. సురేశ్ బొబ్బిలి సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సిద్ శ్రీరామ్ పుత్తడి బొమ్మ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో 11 లక్షల వ్యూస్ తెచ్చుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది’’ అని అన్నారు.