Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Disha Encounter Fake : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. ఈ ఎన్ కౌంటర్ పై క్షేత్రస్థాయిలో సమగ్రంగా దర్యాప్తు చేసిన కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదికను అందించింది. ఈ మేరకు 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ వ్యవహారంలో పోలీసులపై హత్యానేరం కింద విచారణ జరపాలని కమిషన్‌ అభిప్రాయపడింది. నిందితులు ఎదురుకాల్పుల్లో మరణించారన్న పోలీసుల వాదన నమ్మశక్యంగా లేదంటూ అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో జస్టిస్‌ వి.ఎస్‌. సిర్పూర్కర్‌ కమిషన్‌ పేర్కొంది.పోలీసులు వి.సురేందర్, కె.నర్సింహారెడ్డి, షేక్ లాల్ మాధర్, మహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కె.వెంకటేశ్వర్లు ఎస్.అర్వింద్ గౌడ్, డి.జానకిరాం, ఆర్.బాలూ రాఠోడ్, డి.శ్రీకాంత్‌పై విచారణ జరపాలని కమిషన్‌ సూచించింది. ఈ పది మంది పోలీసులపై ఐపీసీ 302, రెడ్ విత్ 34, 201, రెడ్ విత్ 302, 34 సెక్షన్ల కింద విచారణ జరపాలని నివేదికలో పేర్కొంది.

అంతకు ముందు దిశ నిందితుల ఎన్ కౌంటర్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. నివేదిక కాపీని ప్రభుత్వానికి, పిటిషనర్లకు ఇవ్వాలని సిర్పుర్కర్‌ కమిషన్‌ న్యాయవాదికి ఆదేశం. తదుపరి విచారణ హైకోర్టు చేపడుతుందని, ఇరువురు తమ వాదనలు హైకోర్టు ముందే వినిపించాలన్న సిజెఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్ హిమ కోహ్లి ల తో కూడిన ధర్మాసనం.

హైద్రాబాద్ కు సమీపంలోని షాద్ నగర్ చటాన్ పల్లి అండర్ పాస్ వద్ద 2019 లో  దిశపై నలుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ ఘటన 2019 నవంబర్ 28న జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు వ్యక్తులను మహమ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ, జోల్లు నవీన్ లను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. అయితే నిందితులను తమకు అప్పగించాలని బాధితుల బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దిశకు న్యాయం జరగాలంటే నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు లాఠీచార్జీ చేశారు. నిందితులను సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసేందుకు చటాన్ పల్లి అండర్ పాస్ వద్దకు తీసుకొచ్చిన సమయంలో పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులు మరణించినట్టుగా అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు.

ఈ ఎన్ కౌంటర్ పై హక్కుల సంఘాలు సుప్రీంకోర్టులో పిటిసన్ దాఖలు చేశాయి. ఈ ఎన్ కౌంటర్ పై అనుమానాలు వ్యక్తం చేశాయి. విచారణకు డిమాండ్ చేశాయి. దీంతో సుప్రీంకోర్టు సిర్ప్కూర్కర్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. సిర్పూర్కర్ కమిషన్  హైద్రాబాద్ కేంద్రంగా విచారణ నిర్వహించింది. ఈ కమిషన్ నివేదికను ఈ ఏడాది జనవరి మాసంలో సుప్రీంకోర్టుకు అందించింది.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై  ఫోరెన్సిక్ నివేదికలు, డాక్యుమెంట్ రికార్డ్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, పోస్ట్ మార్టం రిపోర్ట్స్, సీన్ ఆఫ్ అఫెన్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కమిషన్ సభ్యులు సేకరించారు. అడ్వకేట్స్, ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు, మాజీ సైబరాబాద్ సీపీ సజ్జనార్, దిశ కుటుంబ సభ్యులు, ఎన్ కౌంటర్ లో చనిపోయిన కుటుంబ సభ్యులను కమిషన్  విచారించింది.  వీటి ఆధారంగా తయారు చేసిన నివేదికను సిర్పూర్కర్ కమిషన్ ఉన్నత న్యాయస్థానానికి అందించింది.

ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీస్ అధికారులు సైబరాబాద్ సీపీగా అప్పట్లో పనిచేసిన వీసీ సజ్జనార్  సహా పోలీసు వ్యాన్ డ్రైవర్లను కూడా కమిషన్ విచారించింది కీలకమైన  రిపోర్టు తయారు చేసింది.ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని కూడా కమిషన్ సభ్యులు పరిశీలించారు. అంతేకాదు ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీసు అధికారిని కూడా  కమిషన్ విచారించి రిపోర్టు సిద్దం చేసింది.

దిశ అదృశ్యమైన సమయంలో  పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని అప్పట్లో విమర్శలు తలెత్తాయి.ఈ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై సస్పెండ్ చేశారు సైబరాబాద్ సీపీ.

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com