విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన లైగర్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. దీనితో వీరిద్దరి కలయికలో అట్టహాసంగా మొదలైన రెండో సినిమా ‘జనగణమన’ కూడా ఆగిపోయింది. అయితే.. లైగర్ డిజాస్టర్ తో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ తమకు న్యాయం చేయాలని పూరీ జగన్నాథ్ ను సంప్రదించగా తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత లైగర్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ తనని బెదరిస్తున్నారని.. ఇంటికి పైకి దాడికి ప్రయత్నించారని.. ఇలా చేసిన వారికి తప్ప మిగిలిన వాళ్లకు అమౌంట్ ఇస్తానని పూరి చెప్పడం సంచలనం అయ్యింది.
ఇప్పుడు మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. తమకు భారీ నష్టాలు వచ్చాయని.. ఆదుకోవాలని కోరుతూ ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ఆందోళనకు దిగారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అండ్ లీజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీనిపై సినీ నటి, నిర్మాత చార్మీ స్పందించింది. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, త్వరలో వారికి అనుకూలంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు ఆమె ఫిల్మ్ ఛాంబర్ కు మెయిల్ ద్వారా సందేశాన్ని పంపించారు. త్వరలో అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఈ వివాదం తెర పైకి రావడానికి కారణం ఏంటంటే… రామ్ తో పూరి మూవీ చేస్తున్నారు. ఈ నెల 15న ఈ చిత్రాన్ని అనౌన్స్ చేయనున్నారు. అందుచేత ఇప్పుడు తమ సమస్యను పరిష్కరించకుండా కొత్త సినిమా స్టార్ట్ చేయడం ఏంటి అని రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మరి.. పూరి జగన్నాథ్ త్వరలోనే ఈ వివాదాన్ని పరిష్కరించుకుంటారేమో చూడాలి.