Divya Kshetram : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ముచ్చింతల్ దివ్యక్షేత్రం దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదికైంది. శ్రీ రామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు బుధవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందుకోసం ఏకంగా 45 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ రామానుజాచార్యుల ఆలయాన్నే నిర్మించారు. రూ.వెయ్యి కోట్ల నిధులు వెచ్చించి సుమారు ఆరేండ్ల పాటు నిర్విరామంగా ఈ పనులు కొనసాగాయి. నాటి పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర సామ్రాజ్యాలను శైలులను మేళవించి ఇక్కడి నిర్మాణాలు చేపట్టారు.
5 వేల మంది రుత్వికులతో..
సహస్రాబ్ది ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి 5 వేల మంది రుత్వికులు వస్తున్నారు. 12 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 120 యాగశాలల్లో 1,035 హోమగుండాలను సిద్ధం చేశారు. వివిధ రాష్ర్టాల నుండి సేకరించిన 2 లక్షల కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని హోమానికి వినియోగిస్తారు. ఈ సందర్భంగా పండితులు కోటి సార్లు అష్టాక్షరి మహామంత్రాన్ని జరిపిస్తారు.
ఫిబ్రవరి 5న జాతికి అంకితం..
శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరుగనున్నాయి. ఫిబ్రవరి 5న మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రధాని మోదీ సమతామూర్తి మహావిగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు. 13వ తేదిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వస్తారు. ప్రధానాలయంలోని నిత్య పూజామూర్తి బంగారు విగ్రహానికి తొలిపూజ చేస్తారు. ఈ వేడుకలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరుండి పర్యవేక్షించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఆకర్షణీయంగా కళాకృతులు
దివ్యక్షేత్రం ఆవరణలో రాజస్థాన్‌లో లభించే పింక్ గ్రానైట్‌తో పలు ఆకృతులను తయారు చేశారు. రామానుజుల జీవిత విశేషాలు తెలిపే మ్యూజియం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సమతామూర్తి విగ్రహంలో పద్మపీఠంపై పంచలోహాలతో తయారు చేసిన 36 శంఖుచక్రాలతో పాటు ఏనుగు ఆకృతులు అమర్చారు. ఈ దివ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దేందుకు దాదాపు 1200 మంది శిల్పులు, ఇతర చేతివృత్తి కళాకారులు నిరంతరం పనిచేస్తున్నారు. విభిన్న రంగులతో దాదాపు రెండు లక్షల మొక్కలతో ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు ఈ క్షేత్రానికి మరింత వన్నె తెచ్చాయి.
ఎలా వెళ్లొచ్చంటే..
బస్సు రూట్లు ఇలా..
మెహిదీపట్నం నుంచి శంషాబాద్‌కు 188, 251 బస్సులు ప్రతి గంటకు అందుబాటులో ఉంటాయి. అఫ్జల్‌గంజ్ నుంచి 251 నంబరు గల బస్సులు
అఫ్జల్‌గంజ్, ఎంజీబీఎస్ డిపో నుంచి జేపీ దర్గా వెళ్లే అన్ని బస్సులు శంషాబాద్ వరకు చేరుకుంటాయి. అక్కడ నుంచి పాలమాకుల చేరుకుని ముచ్చింతల్ వరకు వస్తే అక్కడ నుంచి ఆశ్రమసేవకులు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తారు. రెండు రాష్ర్టాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు వచ్చే బస్సుల ద్వారా మార్గమధ్యలో ముచ్చింతల్‌కు చేరుకోవచ్చు.
రైల్వే రూటులో..
కాచిగూడ నుంచి శంషాబాద్ రైల్వేస్టేషన్‌లో దిగి. ముచ్చింతల్‌కు బస్సులో వెళ్లొచ్చు.
కర్నూలు, బెంగళూరు, మహబూబ్‌నగర్ నుంచి శంషాబాద్ వరకు రైలు సౌకర్యం ఉంది.
విమాన సౌకర్యం..
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రతి అరగంటకు దేశీయ విమాన సౌకర్యం ఉంది.
ఎయిర్ పోర్టు నుండి శంషాబాద్ పట్టణానికి చేరుకొని అక్కడి నుండి ముచ్చింతల్ వెళ్లొచ్చు.
ప్రధానాకర్షణగా ఫౌంటెయిన్
సమతామూర్తి మహావిగ్రహం చుట్టూ శ్రీ వైష్ణవంలో దివ్య దేశాలుగా భావించే 108 పుణ్యక్షేత్రాలు, గర్భాలయాల ఆకృతిలో 108 ఆలయాలను నిర్మించారు. వీటిని ఆనుసంధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్యదేశ మండపాన్ని నిర్మించారు. ఈ దివ్య క్షేత్రంలోకి అడుగుపెట్టగానే అష్టాదశ పద్మాకృతిలో ఉండే 45 అడుగుల ఎత్తులో కూడిన ఫౌంటెయిన్ కనిపిస్తుంది. పద్మ పత్రాలు విచ్చుకునేలా దాదాపు రూ.25 కోట్లతో దీన్ని నిర్మించారు. పద్మపత్రాల మధ్య నుంచి నీళ్లు, రామానుజులను అభిషేకిస్తున్న భావన భక్తులకు కలుగుతుంది. అదే సమయంలో రామానుజుల కీర్తనలు శ్రావ్యంగా వినిపిస్తాయి. సూర్యాస్తమయం తర్వాత రామానుజులు ప్రబోధించిన సమానత్వ ఘట్టాలను మ్యూజిక్‌తో త్రీడీ షో ద్వారా ప్రదర్శిస్తారు.
ఉత్సవాలు సాగేదిలా..
ఫిబ్రవరి 3న అగ్ని ప్రతిష్ఠ, అష్టాక్షరి జపం
5న ప్రధాని నరేంద్ర మోదీ రాక రామానుజాచార్య మహా విగ్రహవిష్కరణ
8,9 తేదీల్లో ధర్మ సమ్మేళనం
9న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాక
10న సామాజికనేతల సమ్మేళనం
11న సామూహిక ఉపనయనం
12న విష్ణు సహస్రనామ పారాయణం
13న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాక
14న మహా పూర్ణాహుతి
5821 సిబ్బందితో భద్రత ముచ్చింతల్ శ్రీరామనగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు జరిగే వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి, సీఎం కేసీఆర్‌లు హాజరవుతుండటంతో పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సారథ్యంలో దాదాపు 5821 మంది సిబ్బందితో భద్రతను కల్పించనున్నారు. ఫిబ్రవరి 5న ప్రధాని వస్తుండటంతో ఇప్పటికే ఎస్‌పీజీ బృందాలు ప్రత్యేక భద్రత ఏర్పాట్లలో తలమునకలయ్యాయి. ఉన్నతాధికారులు సీనియర్ అధికారులను రంగంలోకి దింపి శ్రీరామనగరానికి వెళ్లే రూట్‌మ్యాపును సిద్ధం చేయడంతో పాటు సైబరాబాద్ కమాండ్ కంట్రోల్‌కు సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు. బాంబ్, డాగ్ స్కాడ్‌తో నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. అంతేకాక వీఐపీ రూట్లను సిద్ధం చేశారు. ఎస్పీజీ, స్పెషల్ పార్టీ, స్థానిక పోలీసులతో మొత్తం మూడంఅంచెల భద్రతను కల్పిస్తున్నారు.
విశిష్టతలు
ఆకాశమే హద్దుగా అత్యంత ఎత్తయిన రామానుజాచార్యుల దివ్యరూప దర్శనం
సువర్ణమూర్తిగానూ నిత్య ఆరాధన
ప్రతి సాయంకాలం కమలం నుండి ఆవిర్భవించే నీటితో అభిషేకం
రామానుజుల చరిత్రలోంచి స్ఫూర్తిదాయక సన్నివేశాల సందర్శన
ఎన్నో ప్రత్యేకతలు..
108 దివ్య దేశాలకు సంబంధించిన నిర్మాణాలు, నిర్మాణ శైలి ఉంటుంది.
ఇంగ్లిషు, హిందీ, తెలుగు, తమిళంలో ఆడియో గైడెన్స్ వినిపించేటట్లుగా ఏర్పాట్లు.
ఓమ్నీ మ్యాక్స్ థియేటర్ నిర్మాణం. దానిపై ఆధ్యాత్మిక విశేషాలు, ప్రసంగాలు వినిపిస్తారు.
నక్షత్రాకృతిలో కనువిందు చేసే 48 స్తంభాలు
ఆ స్తంభాలపైన 32 బ్రహ్మ విద్యల శిల్పాలు (వీటిని ఏఆర్ ఆగ్మంటెడ్ రియాలిటీతో అనుసంధానం చేస్తారు)
అష్టాశ్రమ ఆకృతిలో ఉండే నిర్మాణం
బంగారు విగ్రహం మీద కనువిందు చేసే పంచవర్ణాల విద్యుత్ దీపాలు.
Also Read : ఇది జీరో బడ్జెట్.. రాహుల్ గాంధీ ట్వీట్