Wednesday, January 22, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంస్నాక్ మార్కెట్ భారతీయం

స్నాక్ మార్కెట్ భారతీయం

కుర్కురే కరకరా నమిలిపారేసేవారు మొన్నటివరకు మనపిల్లలు. పిజ్జా, బర్గర్లు కావాలని దోసెలు, ఊతప్పాలు పక్కన పెట్టిన తరం. కలికాలం అని బాధపడ్డాం. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణంలాగా అవి అరగాలని కోరుకున్నాం. మెల్లగా సీన్ మారుతోంది. మన దేశీ చిరుతిళ్ళు ఇంటా బయటా కూడా ఆదరణ పొందుతున్నాయి. మార్కెట్లో సందడి చేస్తున్నాయి.

చిరుతిళ్ళ పెద్ద పాత్ర
మన దక్షిణాదిలో జంతికలు, కారప్పూస, చేగోడీలు, మురుకులు అంటాం. పిల్లలు ఎల్లవేళలా, పెద్దవాళ్ళు కొన్నిసమయాల్లో తింటారు. ఒకప్పుడు ఇళ్లల్లో మాత్రమే తయారయ్యేవి. అరుదుగా స్కూళ్ల దగ్గర అమ్మేవారు. కొన్నేళ్ళక్రితం బహుళజాతి కంపెనీల ప్రవేశంతో చిత్ర విచిత్రమైన కుర్కురే, పొటాటో చిప్స్ , చీజ్ బాల్స్ వంటివి మార్కెట్లో ప్రవేశించాయి. ఇవి ఎంతలా కమ్ముకొచ్చాయంటే పసిపిల్లలు సైతం అవే కావాలని మారాం చేసేవారు. అందమైన ప్యాకింగ్ లో నోరూరించే బొమ్మలతో వచ్చిన ఈ స్నాక్స్ పిల్లలు, పెద్దలని కూడా ఆకట్టుకున్నాయి. అప్పట్లో స్వదేశీ తినుబండారాలు వెలవెలపోయాయి. పండగలప్పుడు తప్పితే మన పిండివంటలు అడిగేవారే లేరు. కాలం దేన్నయినా తారుమారు చేస్తుందన్నట్టు మెల్లగా మన చిరుతిళ్ళు కూడా మార్కెటింగ్ మెళకువలు నేర్చుకుని అందంగా ప్యాకింగ్ కెక్కాయి. విదేశీ కంపెనీల కన్నా తక్కువ ధరలో అన్ని సైజుల ప్యాకెట్లలో మార్కెట్ కొచ్చేశాయి. అక్కడినుంచి వెనక్కి తిరగలేదు. అన్ని రాష్ట్రాల చిరుతిళ్ళు ఇలా దొరకడంతో మార్కెట్ స్వరూపమే మారిపోయింది.

విదేశీ కంపెనీలతో పోటీపడే విధంగా మన కంపెనీలు వృద్ధి సాధించాయి. 2023 -24 సంవత్సరానికి 50,800 కోట్ల రూపాయల వ్యాపారం కారప్పూస, ఆలూ భుజియా, అటుకుల మిక్సర్ , వేయించిన పల్లీలవంటి తినుబండారాలదే. విదేశీ మార్కెట్లో కూడా వీటికి చక్కటి ఆదరణ ఉంది. కోవిడ్ తర్వాత అందరిలో మన చిరుతిళ్ళు మంచివి అనే స్పృహ కలిగింది. విదేశాలకు సైతం భారీగా ఎగుమతులు మొదలయ్యాయి.

ఫుడ్ మార్కెట్ లో 56 శాతం చిరుతిళ్లదే. వీటిలో హల్దీరామ్స్ వాటా 24 శాతం, బాలాజీ 12 శాతం, ఐటీసీ 7 శాతం , బికాజీ 4 శాతం, పెప్సీ 14 శాతం ఉంది. ఇంకా అనేక స్థానిక కంపెనీలు ఉన్నాయి. అదే కొన్నేళ్ల క్రితం ఆలూ చిప్స్ , కుర్కురే వంటి ఉత్పత్తులది మూడింట రెండువంతుల మార్కెట్. పెప్సీ, ఐటీసీ ఫుడ్స్ మాత్రమే పోటీలో ఉండేవి. వీరు ప్రకటనలు, మార్కెటింగ్ చాతుర్యంతో అమ్మకాలు సాధించారు. అదే టెక్నిక్ తో స్వదేశీ తయారీదారులు గ్రామాలకూ చొచ్చుకు పోయారు. స్నాక్ మార్కెట్ లో 40 శాతం 3000 మంది చిరువ్యాపారుల నిర్వహణలో ఉంది.

ప్రధానంగా చిరుతిళ్ళ మార్కెట్ నాలుగు భాగాలనుకుంటే మొదట భుజియా, నట్స్ తర్వాత పొటాటో చిప్స్, కుర్కురే, చీజ్ బాల్స్ ఉంటాయి. కోవిడ్ తర్వాత ఆరోగ్య స్పృహ పెరగడంతో అందరూ ఎక్కడ పడితే అక్కడ కాక శుభ్రంగా ఉండే ప్యాకింగ్ స్నాక్స్ కొంటున్నారు. ఆ రకంగా చూస్తే వినియోగదారుల్లో స్పష్టమైన మార్పు వచ్చిందనుకోవచ్చు. అంతేకాదు చిన్నగా దుకాణం పెట్టినవారూ అంతకంతకూ విస్తరిస్తున్నారు. బ్రాండెడ్ చిరుతిళ్లతో పోటీ పడుతున్నారు. హల్దీరామ్ దాదాపు అన్ని సంప్రదాయ చిరుతిళ్ళు అమ్ముతూ ఏడాదికి 18 శాతం చొప్పున అమ్మకాల్లో పెరుగుదల సాధిస్తోంది. తర్వాతి స్థానాల్లో పెప్సికో, బాలాజీ వేఫర్స్ ఉన్నాయి. మొత్తమ్మీద భారతీయత అన్నిరంగాల్లో తన ఉనికి చాటుకుంటోంది. ఇకముందు అన్ని సందర్భాల్లో చాకోలెట్లు, చిప్స్ కాకుండా మన పిండివంటలు దర్శనమిస్తాయన్నమాట!

-కె.శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్