వారం రోజుల్లో ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నట్టు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తారని ప్రచారం జరుగుతున్న వేళ.. ట్రంప్ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. గత ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరించడానికి ట్రంప్ ససేమిరా అన్నారు. శ్వేతసౌథం నుంచి బయటకు రావడానికి ఒక దశలో ఆయన ఒప్పుకోలేదు. ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని ఆరోపిస్తూ ట్రంప్ న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే, ఆయనకు అక్కడ చుక్కెదురయ్యింది. దీంతో చివరకు అధ్యక్షభవనం వీడి జో బైడెన్‌కు పగ్గాలను అప్పగించారు. 2024 ఎన్నికల్లో తాను పోటీచేస్తానని ట్రంప్ సంకేతాలిచ్చారు.
సోమవారం ఓహియోలో జరిగిన మధ్యంతర ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ‘‘చాలా ముఖ్యమైన, కీలకమైన ఎన్నికల నుంచి తప్పుకోకుండా… నేను నవంబర్ 15 మంగళవారం ఫ్లోరిడా పామ్ బీచ్‌లోని మార్-ఎ-లాగోలో చాలా పెద్ద ప్రకటన చేయబోతున్నాను. ’’ అని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై ట్రంప్ గత వారం నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు ఏం ప్రకటన చేయబోతున్నారనేది అమెరికా వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్లు తనను మోసం చేసి గెలిచారని ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇటీవల అయోవాలో జరిగిన ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘2020 ఎన్నికల సమయంలో జరిగిన మోసం వల్ల నేను ఓడిపోయాను.. ఈసారి కచ్చితంగా విజయం నాదే.. ఇప్పటికే నేను రెండుసార్లు పోటీ చేశాను.. 2016లో కంటే 2020లో ఎక్కువ ఓట్లు వచ్చాయి.. ఇప్పుడు మళ్లీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా’’ అని వెల్లడించారు.