అధికారంలోకి రాగానే రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గించడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. యువ గళం పాదయాత్ర కర్నూల్ జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో జరుగుతోంది. టమోటా రైతులతో లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. తమ ప్రభుత్వ హయంలో ఇరిగేషన్ తో డ్రిప్ ను మెరుగుపరిచామని, అగ్రికల్చర్ తో పాటు హార్టి కల్చర్ ను ప్రోత్సహించామని గుర్తు చేశారు.
రాయలసీమ బిడ్డ అంటూ తనపై పాటలు రాయించుకున్న సిఎం జగన్ ఇక్కడి రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ను నిర్లక్ష్యం చేశారని, తాము పోరాడిన తరువాత ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందిస్తున్నారని, కానీ అవి నాసిరకంగా ఉంటున్నాయని, ఒక సీజన్ కే పాడైపోతున్నాయని ఆరోపించారు. నాలుగైదు సార్లు ఉపయోగించుకునేలా ఉండాలని అప్పుడే రైతులకు ఉపయోగమని అన్నారు. అనంతపురం, కర్నూల్ జిల్లాల్లోని ప్రత్తి రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోయారని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, విత్తనాల్లో లోపం లేదని, ప్రకృతి వైఫల్యం వల్లే రైతులకు నష్టం వాటిల్లిందని అధికారులు నివేదిక ఇవ్వడం ఎంతవరకూ సబబని నిలదీశారు.
కేంద్రం నుంచి అదనపు అప్పుకోసం మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని, రైతుల వద్దకు అగ్రిమెంట్ల కోసం వచ్చినప్పుడు తిరస్కరించాలని, బలవంతంగా మీటర్లు పెడితే పగలగొట్టాలని పిలుపు ఇచ్చారు. రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ ఉందని, రైతులు అధైర్య పడవద్దని, అధికారంలోకి రాగానే ఆదుకుంటామని హామీ ఇచ్చారు.