Manipur: హింస ఆపకపోతే అంతర్యుద్దమే – మైతీ గిరిజనులు

మణిపూర్‌లో పెచ్చరిల్లుతున్న హింసను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆపకపోతే రాష్ట్రంలో అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉన్నదని మైతీ ప్రజా సంఘాల్లో ఒకటైన మైతీ లీపన్‌ అధ్యక్షుడు ప్రమోత్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ది వైర్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మైతీలు ఉమ్మడిగా ప్రతిస్పందించబోతున్నారని, మైతీల వైపు నుంచి విస్ఫోటనం రాబోతున్నదని హెచ్చరించారు. తమపై జరుగుతున్న దాడులను మైతీలు ప్రతిఘటించగలరని, మే 3న జరిగింది కేవలం ఒక నిప్పురవ్వ లాంటిది మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. మణిపూర్‌ అంశాన్ని స్థానిక కుకీ – మైతీ తెగల వివాదంగా చూడొద్దని, ఇది భారత్‌ – అక్రమ వలసల మధ్య అంశమన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌దళ్‌తో తమ సంఘానికి ఎలాంటి సంబంధం లేదని, కాకపోతే ఏబీవీపీ ప్రభావం మాత్రం వ్యక్తిగతంగా తనపై ఉన్నదని ఓ ప్రశ్నకు ప్రమోత్‌ సింగ్‌ సమాధానం ఇచ్చారు.

పోలీసుల నుంచి చోరీకి గురైన ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు గాను మణిపూర్‌లోని సున్నిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా మోర్టర్‌, హ్యాండ్‌ గ్రెనేడ్స్‌ సహా 29 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఆయుధాలను స్వచ్ఛందంగా అప్పగించాలని ప్రజలను కోరుతున్నట్టు చెప్పారు. మణిపూర్‌లో ఇంటర్నెట్‌పై నిషేధాన్ని ఎత్తివేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పోలీసు శాఖకు ఆ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *