సీయం కేసీఆర్ పేదల పక్షపాతి అని, అందుకు పేదింటి ఆత్మ గౌరవాన్ని పెంచేలా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో రూ.3. 51 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 71 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి.. గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన అని, అందుకే విశాలమైన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంకు శ్రీకారం చుట్టారని అన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల వంటివి మరే రాష్ట్రంలో లేవని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారుల ఎంపికను ఎంతో పారదర్శకంగా చేపట్టిందన్న మంత్రి..లబ్ధిదారులు ఒక్క పైసా కూడా చెల్లించకుండానే ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తుందని స్పష్టం చేశారు.
నిర్మల్ నియోజకవర్గానికి 3761 ఇండ్లు మంజూరు కాగా, నిర్మల్ పట్టణ వాసులకు కేటాయించిన 2,200 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని, ఇప్పటికే వీటిలో 1500 ఇండ్ల నిర్మాణం పూర్తి కావచ్చాయని వెల్లడించారు. నిర్మాణాలు పూర్తి అయిన వాటికి లబ్ధిదారులను ఎంపిక చేసి అందజేస్తామని, నిర్మాణంలో ఉన్న మిగతా గ్రామాల్లో ఇండ్లను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు.