Monday, June 15, 2026
HomeTrending Newsనిరుపేదలకే డబుల్ బెడ్ రూమ్ -కేటిఆర్

నిరుపేదలకే డబుల్ బెడ్ రూమ్ -కేటిఆర్

హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో వాటిని పేదలకి అందించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నట్లు తెలిపిన అధికారులు, ఇందులో 60000 ఇండ్లు పూర్తయ్యాయని తెలిపారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్, నానక్రాం గూడా కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణము, వాటిని లబ్ధిదారులకు అందించే ప్రక్రియ ప్రారంభం పైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పూర్తయిన 60 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి అవసరమైన మార్గదర్శకాలను వారం రోజుల లోపల సిద్ధం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర హౌసింగ్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని ఈ మార్గదర్శకాలను వెంటనే రూపొందించాలన్నారు. మార్గదర్శకాలను రూపొందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న సమగ్ర కుటుంబ సర్వే సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకొని లబ్ధిదారుల ఎంపిక ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అందించే  ప్రతి ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కచ్చితంగా ఇల్లు లేని నిరుపేదలకు మాత్రమే అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి అవసరమైన క్షేత్రస్థాయి గుర్తింపు, వెరిఫికేషన్ వంటి కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. వచ్చేవారం మరోసారి ఈ అంశం పైన సమావేశం ఉంటుందని తెలిపిన కేటీఆర్, ఆలోగా తుది మార్గదర్శకాలతో, ఇండ్ల పంపిణీకి సంబంధించి అవసరమైన ఖచ్చితమైన కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఈ సమావేశంలో పురపాలక శాఖ, హౌసింగ్, జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular