దళిత, బహుజన పీడిత వర్గాల ఆరాధ్య దైవం డాక్టర్ బీఆర్ అంబేద్కర్. కులం కట్టుబాట్లతో అణచివేతకు గురైన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా జీవిత చరమాంకం వరకు కృషి చేసిన సామాజిక విప్లవకారుడు భీమ్ రావు అంబేద్కర్. దేశవ్యాప్తంగా అంబేద్కర్ పుట్టినరోజు పురస్కరించుకుని ప్రతి ఏడాది ఏప్రిల్ 14న ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇతర దేశాల్లో కూడా అంబేద్కర్ జయంతి వేడుకలు జరుగుతాయి. దళిత బహుజనుల జీవితాల్లో వెలుగులు నింపిన బాబా సాహెబ్ అంబేద్కర్ 133 వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని జీవితంలో ముఖ్య ఘట్టాలు తెలుసుకుందాం.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్ర(ప్రస్తుతం మధ్యప్రదేశ్)లోని అంబవాడేలో మెహర్ కులంలో రామ్‌జీ మాలోజీ సక్పాల్, భీమాబాయ్ రామ్‌జీ సక్పాల్ దంపతులకు ఆఖరి సంతానంగా జన్మించారు. ఆయన తండ్రి రామ్‌జీ మాలోజీ సక్పాల్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదార్‌గా పనిచేసేవారు. అంబేద్కర్‌కు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆయన ఆర్మీ నుంచి పదవీ విమరణ పొందారు. ఆయనకు ఆరేళ్ల వయస్సప్పుడు తల్లి భీమాబాయ్ మరణించారు. సతారాలో ఆయన పాఠశాల విద్య ప్రారంభమైంది. చిన్న వయసులోనే తల్లి మరణించడంతో పినతల్లి ఆయన బాగోగులు చూసింది.
పాఠశాల విద్య కొనసాగుతుండగానే కుటుంబం బాంబేకు తరలివెళ్లడంతో అంబేద్కర్ పాఠశాల విద్య బాంబేలో పూర్తిచేశారు. పాఠశాల విద్య కొనసాగినన్ని రోజులు తీవ్ర కుల వివక్షను ఎదుర్కొన్నారు. బీఏ ఉత్తీర్ణులైన అంబేద్కర్.. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి విద్యా సంస్థల నుంచి పీజీ, పీహెచ్‌డీ, న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తిచేశారు. విదేశాలలో ఎకనమిక్స్‌లో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి భారతీయుడిగా గుర్తింపు పొందారు.
చిన్న వయసులో మనసుకు తగిలిన గాయాలు ఆయనను జీవితాంతం అంటరానితనాన్ని, సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు పోరాడేలా చేశాయి. ఈ పోరాటంలో ఆయన చాలా వరకు విజయం సాధించారు. యుక్త వయసు వరకు అవమానాలు భరించినా… తన ప్రతిభను చాటుకుని సమాజంలో ఒక మహోన్నత మూర్తిగా నిలిచారు.
అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని, మనుధర్మాన్ని సవాల్ చేశారు. 1927లో జరిగిన దళిత జాతుల మహాసభకు మహారాష్ట్ర, గుజరాత్ నుంచి వేలాది మంది తరలివచ్చారు. మహత్ చెరువులోని నీటిని తాగడానికి వారికి అనుమతి లేకపోగా.. అంబేద్కర్ ఆ చెరువులోని నీటిని తాగడం చరిత్రలో అదో సంచలనం.
విద్యాభ్యాసం తర్వాత ఆర్ధికవేత్తగా, ప్రొఫెసర్‌గా, న్యాయవాదిగా పలు పాత్రలు పోషించారు. తరువాత జాతీయోద్యమంలోకి వచ్చారు. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత దళితుల రాజకీయ హక్కులు, సామాజిక స్వేచ్ఛ కోసం పనిచేశారు. రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా సేవలందించి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం తయారీలో కీలక పాత్ర పోషించారు. అలాగే, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్థాపనలో అంబేడ్కర్ పాత్ర ఉంది. హిల్టన్ యంగ్ కమిటీకి బాబాసాహెబ్ అందించిన భావనతో ఆర్బీఐ ఏర్పాటయ్యింది.
మరణానికి కొన్ని రోజుల ముందు 1956 అక్టోబర్‌లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించారు. హిందూమతంలో జన్మించిన అంబేద్కర్ కుల వివక్షకు వ్యతిరేకంగా మతం మారాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించడానికి 20 ఏళ్లు పట్టింది. అప్పట్లో అందరినీ సమానంగా చూసిన ఏకైక మతం బౌద్ధమే కావడంతో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు.
వారసత్వ, వివాహ చట్టాలలో లింగ సమానత్వాన్ని వివరించడానికి ప్రయత్నించిన హిందూ కోడ్ బిల్లు ముసాయిదా పార్లమెంటులో నిలిచిపోవడంతో 1951లో న్యాయ మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను తన ఆత్మకథ ‘వెయిటింగ్ ఫర్ ఏ వీసా’లో అంబేడ్కర్ వివరించారు. అంబేద్కర్ మధుమేహం వ్యాధితో బాధపడుతూ 1954లో డిసెంబర్ 6న కన్నుమూశారు.
ఆయన జీవితానికి సంబంధించి మరిన్ని ముఖ్యాంశాలు
1. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అత్యంత ప్రతిభావంతుడు. ఆయన దాదాపు 64 సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీలు సాధించారు. పైగా ఆయన 9 భాషలలో (ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్, గుజరాతీ, హిందీ, పాళీ, సంస్కృతం) అనర్గళంగా మాట్లాడగలిగేవారు. సుమారు 21 సంవత్సరాలపాటు ప్రపంచమంతా తిరిగి అంబేద్కర్ విద్యాభ్యాసం చేశారు.
2. డాక్టరేట్ సాధించిన తొలి భారతీయుడిగా కూడా బీఆర్ అంబేద్కర్‌కు గుర్తింపు ఉంది.
3. బీఆర్ అంబేద్కర్ “వెయిటింగ్ ఫర్ వీసా” పేరుతో రాసిన ఆటో బయోగ్రఫీని కొలంబియా యూనివర్సిటీలో పాఠ్యపుస్తకంగా వినియోగిస్తున్నారు.
4. ఇప్పటివరకు లండన్ మ్యూజియంలో కార్ల్‌మాక్స్ విగ్రహంతోపాటు ఏర్పాటు చేసిన ఏకైక భారతీయుడి విగ్రహం బీఆర్ అంబేద్కర్‌దే కావడం గమనార్హం.
5. బుద్ధ భగవానుడు కళ్లు తెరిచి చూస్తున్నట్టుగా ఉండే పెయింటింగ్‌ను వేసిన తొలి వ్యక్తిగా కూడా అంబేద్కర్‌కు గుర్తింపు ఉన్నది. అంతకుముందు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో బుద్ధుడు కళ్లు మూసుకుని ఉన్న ఫొటోలే కనిపించేవి.
6. భీమ్ రావు అంబేద్కర్ అసలు ఇంటిపేరు అంబావడేకర్. అదే ఆ తర్వాత అంబేద్కర్‌గా మారింది.
-దేశవేని భాస్కర్