Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసిద్ధాంత చౌర్యం

సిద్ధాంత చౌర్యం

Theory plagiarized: మనకున్న 64 కళలలో చోర కళ కూడా ఒకటి.  అన్ని కళలలో నిష్ణాతులు ఉన్నట్లే చోర కళలో కూడా ‘నిష్ణాతులు’ ఉన్నారు.  కాకపోతే వీరిని గుర్తించి అవార్డులు, రివార్డులు ఇచ్చే వారు లేకపోవడంవల్ల గానీ, లేదంటే…. ‘చోర శ్రీ’, ‘చోర భూషణ్’, ‘చోర విభూషణ్’, ‘చోర రత్న’ లాంటి వాటికి విపరీతమైన డిమాండ్ ఉండేది.

గోడలకు కన్నాలు వేసి, తాళాలు పగులగొట్టి చోరీలు చేసే కాలం కాదు ఇది. వ్యాపారాలు, ఆర్ధిక లావాదేవీలు ఆన్ లైన్ అయిపోయి అంతర్జాలంలో పడ్డ తరువాత.. సాఫ్ట్ వేర్ దొంగలు పుట్టుకొచ్చి.. జనం అక్కౌంట్ లలో డబ్బులను ఇటు జనానికి, అటు బ్యాంక్ ల కు కూడా తెలియకుండా ఊడ్చేసి.. చోర కళకు కొత్త భాష్యాలు చెపుతున్నారు.

ఇక వ్యాపారాలు, పరిశ్రమల లోన్ల పేరుతో.. దర్జాగా బ్యాంక్ సిబ్బంది తోనే డబ్బులు బ్యాగ్ ల లోనూ, సూట్ కేసు లోనూ సర్దించుకొని  తీసుకెళ్లి, పెద్ద, పెద్ద పారిశ్రామిక వేత్తలుగా చలమణి అయ్యి, తరువాత ప్రజా ప్రతినిధులుగా మారి.. బ్యాంక్ లకే చుక్కలు చూపిస్తున్న “రైట్ రాయల్ దొంగల” గురించి, వారి “చోర కళ” గురించి చెప్పుకోకపోవడమే మంచిది.

ఇక చోరత్వం కూడా చాలా రకాలుగా ఉంటుంది. కేవలం “ధన చౌర్యమే”.. అసలు, సిసలైన చౌర్యం గా చెలామణీ లో ఉన్నా.. వస్తు చౌర్యం, భావ చౌర్యం, భాషా చౌర్యం, గ్రంథ చౌర్యం, ఆలోచనల చౌర్యం, సిద్దాంత చౌర్యం వంటివి కూడా  అప్పుడప్పుడు వార్తలలోకి వస్తుంటాయి.

సాహిత్యం విషయానికి వస్తే అసలు రచయితల కంటే ఈ కాపీ రచయితలే ఎక్కువ కీర్తి సంపాదిస్తారు. వాక్యాల కాపీ, పేరాల కాపీ, అధ్యాయ కాపీ, మొత్తం పుస్తకమే కాపీ.. ఇలా సాహిత్యం విషయం లో కాపీ పరంపర సాగుతూ ఉంటుంది. ఇక సినిమా రంగం లో అయితే.. కథ  కాపీ, పాట కాపీ, సన్నివేశ కాపీ, సంభాషణల కాపీ, కాస్ట్యూమ్ కాపీ.. ఈ కాపీ పరంపరకు అంతే లేదు.

అయితే సదరు ఈ చౌర్యం ఎప్పుడూ, ఒరిజినల్ రాత గాళ్లకు తెలియకుండా జరగాలని కూడా ఏమి లేదు.. తృణమో, ఫణమో ఇచ్చో, బ్రతిమాలో-బెదిరించో, ఆశ పెట్టో సదరు రచయిత కే చెప్పే.. ఆ రచనలు తమ పేరున చెలామణీ చేసుకొనే  ‘చోర మేధావులు’ ఉంటారు.
ఇక ఈ మేధావి చోరులకు వెనుక కూర్చొని.. వారి పేరునే రాసి పడేసే పనినే వృతి గా చేసుకొనే “దయ్యపు రచయతలు (ఘోస్ట్ రైటర్స్)” ఉంటారు.

ప్రస్తుతం ఈ చోర కళ దాదాపు అన్ని రంగాలను సుడి గాలిలా చుట్టేసింది… ప్రహ్లాదుడికి శ్రీ మహా విష్ణువు “ఎందెందు వెదికి చూసిన అందందే” కనబడినట్లు” … ఈ చోరులు కూడా అన్ని రంగాలలో కనబడతారు. కాకపోతే నవమాసాలు నానా కష్టాలుపడి బిడ్డను కన్న తల్లిని పక్కకు నెట్టి, ఆ బిడ్డ నాదంటే.. ఆ తల్లిఎలా బాధపడుతుందో.. తమ సృజనాత్మకత తో పుట్టించిన దానిని.. వేరే వాడు వచ్చి తన పెరట్లో కట్టేసుకొంటేనే బాధ కలిగి రోడ్డేక్కుతుంటారు..

దీన్ని అరికట్టటానికి ఎన్ని “కాపీ రైట్” చట్టాలు వచ్చినా.. ఈ “కాపీ రాయుళ్ళు” ఆ చట్టాలకు దొరకకుండా ఎలా చౌర్యం చేయాలి.. ఒకవేళ కర్మకాలి దొరికినా “ఎలా బుకాయించాలి” అన్న వాటిలో.. పరిశోధనలు చేసి “డాక్టరేట్” లు సంపాదించి ఉంటారు కాబట్టి.. వారిని “మహా నిష్ణాత చోరులు” గా గుర్తించి గౌరవించడం మినహా మనం చేయగలిగింది లేదు.

ఈ “చోర కళ” ముఖ్యం గా సాహిత్యం లో ఎప్పుడో 10 శతాబ్దం నుంచే ఉన్నదని.. రాజశేఖరుడు అనే కవి తన “కావ్య మీమాంస” లో చెప్పాడట. ఇక మన అన్నమయ్య కూడా ఈ భావ చోరులను “ఛాయాపహారులు” గా పేరు పెట్టి మరీ పరిహసించాడట. ఇక ఆ తరువాత ఈ కాపీ కళను పాచ్యాత్యులు “ప్లేజియరిజమ్” పేరుతో గుర్తించి ప్రచారం లో పెట్టినా.. రోమన్ వారు 1 వ శతాబ్దం లోనే.. ఈ తరహా చోరులకు “అక్షరాల కిడ్నాపర్” అను అర్ధం వచ్చేలా పేరు పెట్టారనేది చరిత్ర.

ఇక శాస్త్ర-సాంకేతిక రంగం లో కూడా ఈ చోరులు తక్కువేమీ కారు. భావనలను, సిద్ధాంతాలను, సిద్ధాంత వ్యాసాలను, పరిశోధన ఫలితాలను, సాంకేతిక సూత్రాలను దొంగిలించి.. తమవిగా ప్రచారం చేసుకొని.. అంతర్జాతీయ గుర్తింపు, అవార్డులు పొందిన.. మహాశయులకు కూడా కొదువ లేదు. ఈ చౌర్యాలను ఆరికట్టడానికి మేధో హక్కు పరిరక్షణ చట్టాలు కూడా వచ్చాయి. కానీ సిద్ధాంత తస్కరణలు మాత్రం ఆగలేదు.

లేటెస్ట్ గా డార్విన్ “జీవ పరిణామ సిద్ధాంతం” ఒక చౌర్యం అని.. నిజానికి ఈ సిద్ధాంతాన్ని డార్విన్ కన్నా 28 సంవత్సరాల ముందే ప్యాట్రిక్ మాధ్యూ అనే వ్యక్తి ప్రతిపాదించాడని.. మైక్ సట్టన్ అనే క్రిమినాలజిస్ట్ “ సైన్స్ ఫ్రాడ్.- డార్విన్ ప్లేజరిజం ఆఫ్ పాట్రిక్ మాథ్యూస్ థియరీ” .. అనే పుస్తకమే రాసి పడే శాడట. పైగా ఈ మాధ్యు సిద్ధాంతాన్ని తనకంటే ముందే చెప్పడని కూడా ఈ రచయిత ముక్తాయింపు ఇచ్చాడట.

ఎప్పుడో 1859 లో డార్విన్ తన గ్రంధాన్ని ప్రచురిస్తే.. తరువాత అనేక పుస్తకాలు రాసిన డార్విన్ స్నేహితులు, సహౌద్యోగులు కూడా ఈ పుస్తకం గురించి తమ రచనలలో ప్రస్తావిస్తే.. మరి ఇప్పటి వరకు ఈ జీవ పరిణామ సిద్ధాంత రూపకర్త మాధ్యు గా ఎందుకు గుర్తించలేదో?

ఇక మైక్ సట్టన్ గారు పుస్తకం బయటకు వచ్చిన తరువాత.. నిజంగా జీవ పరిణామ సిద్ధాంత రూపకర్త “ప్యాట్రిక్ మాధ్యూ” గా అంతర్జాతీయ సమాజం గుర్తిస్తుందో.. లేదా మాధ్యూ సిద్ధాంతానికి పూర్తి సహేతుక వివరణ డార్విన్ ఇచ్చినట్లు బావించి..
దీన్ని మాధ్యూ-డార్విన్ సిద్ధాంతం గా గుర్తింస్తుందో.. లేదా సదరు మన సట్టన్ గారు బయటకు తెచ్చిన సత్యాలలో “పస లేదని” తీసేస్తుందో.. వేచి చూడాలి.

.. శ్రీ వెంకట సూర్య ఫణి తేజ

RELATED ARTICLES

Most Popular

న్యూస్