భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నేడు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో ఉదయం 10.15 గంటలకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. నిరాడంబరంగా జరిగిన వేడుకలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, దౌత్య కార్యాలయాల అధిపతులు/ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఊరేగింపుతో ముర్ము సెంట్రల్ హాలుకు చేరుకున్నారు. జస్టిస్ ఎన్.వి.రమణ రాజ్యాంగంలోని ఆర్టికల్-60 ప్రకారం ఆమెతో ప్రమాణం చేయించారు. ఆ వెంటనే సైన్యం 21 సార్లు గాలిలోకి కాల్పులు జరిపి నూతన రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించింది.
అనంతరం ముర్ము రాష్ట్రపతి హోదాలో ప్రసంగించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక ఆమె రాష్ట్రపతి భవన్‌కు చేరుకోగా అక్కడ త్రివిధ దళాలకు చెందిన సైనిక సిబ్బంది ఆమెకు గౌరవ వందనం చేశారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో దిల్లీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.