Need Awareness: టాటా కంపెనీ మాజీ అధిపతి సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో చనిపోయిన నేపథ్యంలో ఎన్ డి టీ వి దేశంలో ప్రఖ్యాత కార్ల కంపెనీ అధిపతులతో ప్రేక్షకుల సమక్షంలో ఒక చర్చా గోష్ఠి నిర్వహించింది. ఆదివారం ప్రసారమయిన ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమం సోమవారం పునః ప్రసారమయ్యింది. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ చర్చలో పాల్గొన్నారు.
అజాగ్రత్త వల్ల, నిర్లక్ష్యం వల్ల, రహదారి భద్రత సూచనలు పాటించకపోవడం వల్ల ఏటా దేశంలో ఎన్ని లక్షల ప్రాణాలు రోడ్డు మీద విషాద చారికలుగా మిగిలిపోతున్నాయో ఈ కార్యక్రమం లోతుగా విశ్లేషించింది.
⦿ గడచిన ఒక్క ఏడాదిలో 3,75,000 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు.
⦿ వీరిలో 80 శాతం మంది ద్విచక్ర వాహన ప్రమాదాల్లో మరణించినవారు.
⦿ 73 శాతం మంది వెనుక సీట్లో కూర్చున్నప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోవడం లేదు.
⦿ అరవై శాతానికి పైగా ముందు కూర్చున్నవారు సీటు బెల్ట్ పెట్టుకోవడం లేదు.
⦿ సీటు బెల్ట్ పెట్టుకోకపోతే ప్రమాదాల నుండి రక్షించే ఎయిర్ బ్యాగులు తెరుచుకోవు అని 92 శాతం మందికి తెలియనే తెలియదు.
⦿ ఇకపై వెనుక సీట్లో కూర్చున్నవారు కూడా తప్పనిసరిగా బెల్ట్ పెట్టుకునేలా ప్రచారం నిర్వహించాలి.
⦿ ఎంట్రీ లెవెల్ అంటే ఆరు నుండి పది లక్షల లోపు ధర ఉన్న కార్లలో అనేక భద్రతా ప్రమాణాలు పేరుకే ఉంటాయి కానీ…ప్రమాదాల నుండి ఎంతవరకు రక్షిస్తాయన్నది పెరుమాళ్ళకే ఎరుక.
⦿ విద్యుత్తో నడిచే ఎలెక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు ఛార్జింగ్ అవుతున్నప్పుడు పేలిపోవడం, రన్నింగ్ లో వాహనంలో మంటలు రేగడం ఆందోళన కలిగిస్తున్న అంశం.
⦿ పట్టణాలు, నగరాల్లో వాహనాలు పెరిగి పార్కింగ్ కు చోటు లేకపోవడం, ట్రాఫిక్ జాములు పెరిగి ప్రయాణాలు ఆలస్యం కావడం, రోడ్డు మీద బతుకు దుర్భరం కావడం.
ఇలా అనేక అంశాలను ఈ కార్యక్రమంలో చర్చించారు. అందరూ అంగీకరించిన కొన్ని విషయాలివి.
⦿ పార్కింగ్ లేనప్పుడు వాహనం కొనే అర్హత ఉండకూడదు.
⦿ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడడం చిన్నతనం అన్న భావనను తొలగించుకోవాలి.
⦿ చిన్న, పెద్ద అన్ని వాహనాల్లో భద్రతా ప్రమాణాలు ఒకేలా ఉండాలి.
⦿ రహదారి నియమాలను మూడు సార్లకు మించి ఉల్లంఘించేవారి డ్రయివింగ్ లైసెన్స్ ను అమెరికాలోలా రద్దు చేయాలి.
⦿ పట్టణాలు, నగరాల్లో వాహనాల అమ్మకాలు, కొనుగోళ్ల మీద నియంత్రణ ఉండాలి.
⦿ పార్కింగ్ చోటు లేకపోయినా వాహనాలు కొని రోడ్ల మీద శాశ్వతంగా, హక్కుగా అనుకుని పార్క్ చేసే వాహనాలకు జరిమానాలు విధించాలి
ఇవన్నీ అందరికీ తెలిసినవే అయినా ఎవరూ పట్టించుకోని చాలా సీరియస్ విషయాలు. ఇప్పటికయినా మేలుకోకపోతే…దేశం రోడ్డు మీదే పడి, రోడ్డు మీదే ఇరుక్కుని, రోడ్డు మీదే తుది శ్వాస వదులుతుంది.
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :
Also Read :