విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఇటీవల కొందరు బాధ్యతారహితంగా మాట్లాడారని, అవి గాలి మాటలని తాను అప్పుడే చెప్పానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. స్టీల్ ప్లాంట్ ఈవోఐ బిడ్ లో పాల్గొంటామంటూ తెలంగాణ మంత్రులు చేసిన ప్రకటనను పరోక్షంగా బొత్స ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనేది నినాదమని, ఈ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండాలని తాము కూడా గట్టిగా కోరుతున్నామని స్పష్టం చేశారు.
త్వరలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నట్లు బొత్స ప్రకటించారు. ఎన్ని పోస్టులు భర్తీ చేయాలనే దానిపై కసరత్తు జరుగుతోందని, విధానపరమైన నిర్ణయం తీసుకొని తేదీలు, షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. టీచర్ల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్నది ప్రభుత్వ అభిమతమని, దీనికో విధానం రూపకల్పన చేసి ప్రణాళిక ప్రకారం ఈ బదిలీలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. 1998 డిఎస్సీ లో అప్పటికి ఎన్ని పోస్టులు ఉన్నాయో వారందరికీ పోస్టులు ఇస్తున్నామన్నారు. స్కూలు పిల్లలకు రాగిజావ పంపిణీ నిలిపివేశామన్న వార్తల్లో నిజం లేదని, ఒంటిపూట బడుల కారణంగా చిక్కీ ఇస్తున్నామని తెలిపారు,
విశాఖను పాలనా రాజధానిగా చేయాలన్నది తమ ప్రభుత్వం ఎప్పుడో తీసుకున్న విధానపరమైన నిర్ణయమని, న్యాయ పరమైన అంశాలు ఉండడం వల్ల జాప్యం జరుగుతోందని అన్నారు. సిఎం జగన్ విశాఖలో కాపురం పెడతామంటూ చేసిన ప్రకటనను తప్పు బట్టడం సరికాదన్నారు. బాబు సిఎం గా ఉంటూ హైదరాబాద్ లో కాపురం పెట్టలేదా అంటూ ఎదురు ప్రశ్నించారు.
బాబు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, తామే గెలుస్తామని చెప్పకుండా… వైసీపీ గెలుస్తుందని ఆయన ఎలా చెబుతారని, కార్యకర్తలను కాపాడుకోడానికే అధికారంలోకి వస్తున్నామంటూ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. బాబు ఓ మ్యనిపులేటర్, మంచి నటులు అంటూ వ్యాఖ్యానించారు/.