Sunday, May 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకందేవిశ్రీ సూక్తి

దేవిశ్రీ సూక్తి

Item Vs. Devotional:
టీ వీ 9 యాజమాన్యం మై హోమ్. మై హోమ్- అల్లు అరవింద్ సంయుక్త యాజమాన్యంలో టి వీ 9 ప్రధాన కార్యాలయంలోనే నడిచే ఓ టీ టీ- ఆహా. ఆ ఆహాకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసడర్. అదే టీ వీ 9 లో పుష్ప సినిమా ప్రమోషన్ సందర్భంగా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ చేసిన ఒక వ్యాఖ్య మీద డిబేట్ జరగడాన్ని నిష్పాక్షిక జర్నలిజంగా చూడాలని కొందరన్నారు. ఏదో ఒక వివాదంతో మొదటి పది రోజుల్లో పుష్ప వందల కోట్లు సంపాదించే ఎత్తుగడలో అల్లుకున్న వ్యూహమిది అని అనుమానిస్తున్నవారూ ఉన్నారు.

దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడిన ఒక మాట బి జె పి ఎమ్మెల్యే రాజా సింగ్ చేతికి దొరికింది. దొరకాలి కూడా. హిందూ దేవుళ్ల భక్తి గీతాలమీద ఎగతాళి వ్యాఖ్యలు చేసిన దేవిశ్రీ అలాగే మిగతా మతాల భక్తిని ఎగతాళిగా ప్రస్తావించగలరా? అన్న రాజా సింగ్ వ్యాఖ్యకు సమాధానం దొరకదు. బహుశా దేవిశ్రీ క్షమాపణ చెప్పవచ్చు. వ్యాఖ్యలను ఉపసంహరించుకోవచ్చు. వివరణ ఇవ్వవచ్చు. ఇవ్వకపోవచ్చు. నోటికి ఎంతొస్తే అంత…ఏ వేదికమీద ఏమి మాట్లాడుతున్నామో స్పృహలేకుండా మాట్లాడితే…ఫలితం ఎలా ఉంటుందో తెలిపే చిన్న ఉదాహరణ ఇది. దేవిశ్రీ ఆ వ్యాఖ్య చేసినప్పుడు పక్కన పడీ పడీ నవ్వుతున్న సాటి సెలెబ్రెటీలకు కానీ…వేదిక కింద నవ్వుకుంటున్న సినిమా జర్నలిస్టులకు కానీ…ఆ క్షణానికి దాని సీరియస్ నెస్ తెలిసి ఉండదు. ఇది డిజిటల్ యుగం. మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అన్న నాలుగే నాలుగు సెకెన్ల ఆడియో బైట్ ఒకాయన మెడకు ఎలా చుట్టుకుందో చూశాం.

ఈ సందర్భంలో దేవిశ్రీ ప్రసాద్ దొరికిపోయి ఉండవచ్చు. దొరకని దేవిశ్రీలు ఇంకా చాలా మంది ఉండి ఉంటారు. ఐటెం సాంగ్ కు- వెంకన్న పాటకు ముడిపెట్టి…ఈ ముగ్గులోకి శోభారాజ్ ను…అన్నమయ్యను కూడా లాగిన దేవిశ్రీల జ్ఞానశ్రీలను చూసి జాలిపడ్డం తప్ప చేయగలిగింది లేదు.

సెలెబ్రెటీలకు జ్ఞానం పొంగిపొర్లుతూ ఉంటుంది. ఆ జ్ఞానామృత వర్షంలో అజ్ఞానునులమయిన మనల్ను తడిపి ముద్ద చేయాలని వారికి అనిపిస్తూ ఉంటుంది. ఆ మధ్య ఒక దర్శకుడు వేదాలకు భాష్యం చెబితే చాగంటులు చాటంత చెవులు చేసుకుని వినాల్సి వచ్చింది.

నిజమే.
వేటూరి చెప్పినట్లు నాదోపాసనలో దేవిశ్రీ అద్వైత సిద్ధి పొంది…మనకు అమరత్వ లబ్ధి ఇచ్చే స్థాయికి చేరిపోయినట్లున్నారు. ఇక సత్వ సాధనకు సత్య శోధనకు దేవిశ్రీయే మార్గము…
ఐటెం సాంగుకు…భక్తి పొంగుకు దేవిశ్రీయే భాష్యము!


సందర్భం వచ్చింది కాబట్టి- సినిమా పాటల విడుదలలో తెలుగు లిపికి జరుగుతున్న ఘోరమయిన అవమానం గురించి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసే రాజా సింగులు ఉంటే బాగుండేది. పాట రాసేవారు తెలుగువారే. తీసే దర్శకుడు, డబ్బు పెట్టే నిర్మాత తెలుగువారే. సంగీత స్వరాలు కూర్చేవారు తెలుగువారే. పాడేది తెలుగువారే. నటించేవారు తెలుగువారే. చూసే ప్రేక్షకులు, వినే ప్రేక్షకులు కూడా తెలుగువారే. కానీ…ఆ తెలుగు పాటలకు ఆడియోకు తగ్గ టెక్స్ట్ మాత్రం ఇంగ్లీషులో ఉంటుంది. తెలుగే అక్షరమక్షరం కలిపి చదువుకునే నాలాంటి అర్భకులకు ఆ ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీషు చాలా ఇబ్బందిగా ఉంది. మా ఇంగ్లీషు నిరక్షరాస్యతను అవమానిస్తున్నట్లుగా ఉంది.

తెలుగు భాషాభిమాని అయిన భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ లాంటి అధికారమున్న పెద్దలు ఎవరయినా ఈ విషయంలో కలగజేసుకుని పాటల విడుదలలో తెలుగు లిపిని తప్పనిసరి చేయాలి. అంతగా ఇంగ్లీషు లేకపోతే దర్శక నిర్మాతలకు ఊపిరి ఆగిపోతుందనుకుంటే…అనితర సాధ్యమయిన ఆ కెవ్వు కేకల సాహితీ ఖండాలను మొదట-

“కెవ్వు కేక
నువ్వు కాక
నవ్వు కోక
రాక రాక
కోతి మూక
కుక్క తోక”

అని తెలుగులో అఘోరించి…ఆపై-

“Kevvu keka
Nuvvu kaka
Navvu koka
Raka raka
Koti mooka
Kukka toka”

అని వారికి అత్యంత ప్రాణప్రదమయిన ఇంగ్లీషులో కూడా ఇచ్చుకోవచ్చు.

ఈ పాటల సాహిత్యాన్ని తెలుగువారు తెలుగులో చదివి బతికి బట్టకట్టలేరు అన్న విశాల హృదయంతో సినిమా వారు ఇంగ్లీషు లిపిని ఆశ్రయించి ఉంటే…వారి ఔదార్యానికి శత సహస్ర వందనాలు!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

తెలుగు పాటల తిక్క

RELATED ARTICLES

Most Popular

న్యూస్