Logistic Parks: ఆంధ్రప్రదేశ్ లో రెండు లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు దుబాయ్ కి చెందిన పరిశ్రమ ముందుకొచ్చిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.  ప్రభుత్వ సలహాదారు జుల్ఫీ, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, సమక్షంలో గురువారం దుబాయ్ కి చెందిన  తాజ్ బే హోటల్ లో ఇందుకు సంబంధించిన ఎంవోయూ జరిగింది. రూ.500 కోట్లు పెట్టుబడులతో ఏపీలో నిర్మించే లాజిస్టిక్ పార్కులలో గిడ్డంగులు, ప్యాకింగ్ యూనిట్లు, డిస్ ప్లే యూనిట్లు, ముందుగా డెలివరీ చేసే సదుపాయాలకు పెద్దపీట వేస్తూ సరకు రవాణాకు తగిన రైల్ సైడింగ్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు షరాఫ్ గ్రూప్ అంగీకారం తెలుపుతూ ఏపీఈడీబీతో ఎంవోయూ కుదుర్చుకుంది. తద్వారా ఏపీ యువతకు  సుమారు 700 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా దాదాపు మరో 1300 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది వెల్లడించారు.

దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తల చూపు ఏపీ వైపుందని, చౌక రవాణాకు చిరునామా అయిన ఏపీలో పెట్టుబడులు పెట్టడం పెట్టుబడిదారులకు కూడా చౌకగా వాణిజ్యం సాధ్యపడుతుందన్నారు. లాజిస్టిక్ లు, పోర్టులు, పారిశ్రామిక రంగాలలో  పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామమని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి పేర్కొన్నారు.   షిప్పింగ్, లాజిస్టిక్స్, సప్లై చైన్, ట్రావెల్, టూరిజం, ఐ.టీ రంగాలలో ఎంతో అనుభవమున్న షరాఫ్ గ్రూప్ తో ఏపీ ఎంవోయూ చేసుకోవడం భవిష్యత్ పెట్టుబడులకు ఒక మలుపు అవుతుందని ప్రభుత్వ సలహాదారు జుల్ఫీ తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ కి గేట్ వే అని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అన్నారు.  ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జుల్ఫీ రావ్జీ,   పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఏపీలో  అల్యూమినియం కాయిల్ యూనిట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *