సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాల మధ్య రసవత్తరమైన పోటీ ఏర్పడింది. బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సూపర్ హిట్ కాగా, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ సాధించింది. ‘వారసుడు’ సినిమా తమిళ్ సక్సెస్ సాధించింది. తెలుగులో ఫరవాలేదు అనిపించింది. సంక్రాంతికి వచ్చి వెళ్లిపోవడంతో ఇప్పుడు సమ్మర్ కి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచే ఈ సమరం మొదలు కాబోతోంది. సందీప్ కిషన్ ‘మైఖేల్‘ నుంచి ‘పొన్నియిన్ సెల్వన్ 2’ వరకు బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలు సమ్మర్ సమరానికి థియేటర్లలో దండయాత్ర చేయడానికి రెడీ అయిపోతున్నాయి.
అయితే.. సమ్మర్ కి ఏ ఏ సినిమాలు రానున్నాయి అనేది ఆల్రెడీ ఫిక్స్ అయ్యాయి. దీంతో దసరాకి మాత్రం కేవలం నలుగురి మధ్యే వుండబోతోందని తెలుస్తోంది.
ఇంతకీ ఎవరా నలుగురు.. ఏంటా నాలుగు సినిమాలు అంటే.. ముందుగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ గురించి. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న వీరమల్లు సినిమా సమ్మర్ కి విడుదల చేయాలి అనుకున్నారు కానీ.. షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో దసరాకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక మహేష్, త్రివిక్రమ్ ల కలయికలో దాదాపు 12 ఏళ్ల విరామం తరువాత రూపొందుతున్న ‘SSMB28’ ని ముందు ఆగష్టు 11న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే.. ముందు అనుకున్న షెడ్యూల్ మారడంతో ఈ మూవీని దసరాకే థియేటర్లలోకి తీసుకురావాలి అనుకుంటున్నారట.
ఇక ప్రభాస్ ‘సలార్’ మూవీని సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. కృష్ణంరాజు అకాల మరణంతో ప్రభాస్ షూటింగ్ షెడ్యూల్ మారింది. దీంతో సలార్ రిలీజ్ డేట్ కూడా మారే అవకాశం వుందని ఈ మూవీని కూడా దసరాకు రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని ఇన్ సైడ్ టాక్. ఇక వీటితో పాటే యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ – సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ల కలయికలో రూపొందుతున్న ‘ఇండియన్ 2’ కూడా అక్టోబర్ లో రాబోతోంది. అంటే ఈ దసరా సమరానికి ఈ నాలుగు క్రేజీ సినిమాలు బరిలో దిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా ఈ నాలుగు సినిమాలు దసరాకి పోటీపడతాయా..? లేక వీటిలో ఏ సినిమా అయినా దసరా బరి నుంచి తప్పుకుంటుందా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.