మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలను ఈ రోజు భూకంపం వణికించింది. మధ్యప్రదేశ్ లోని పంచ్ మరిలో ఈ రోజు ఉదయం 8.44 కు ఒక్కసారిగా మొదలైన భూప్రకంపనలతో ప్రజలు భయాందోళన చెందారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.9గా నమోదైంది. జబల్ పూర్ నగరానికి 296 కిలోమీటర్ ల దూరంలో పచమర్హి ఉంది. భూకంప కేంద్రానికి సమీపంలోని ప్రాంతాల్లో పురాతన ఇల్లు బీటలు వారాయి. కొన్ని చోట్ల రోడ్ల మీద పగుళ్ళు ఏర్పడ్డాయి. భూకంపం నష్ట వివరాలు తెలియాల్సి ఉంది.
అటు అరుణాచల్ ప్రదేశ్ లో ఈ రోజు (మంగళవారం) వేకువ జామున రిక్టర్ స్కేల్‌పై 3.7 తీవ్రతతో తవాంగ్ నగరానికి సమీపంలోని కమెంగ్‌లో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అసోంలోని జోర్హాట్‌కు 178 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. పాక్‌లోనూ అర్ధరాత్రి భూకంపం సంభవించింది. ఇస్లామాబాద్‌కు 303 కిలోమీటర్ల దూరంలో 4.8 తీవ్రతతో భూకంపం సభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రాన్ని 120 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు పేర్కొంది.