పాకిస్తాన్ లో పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా రికార్డయింది. దీని తీవ్రతకు పలు భవనాలు కంపించాయి. బీటలు వారాయి. పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. ప్రాణ నష్టం చోటు చేసుకున్నట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు. భూమి కంపించిన వెంటనే స్థానికులు నివాసాలను వదిలేసిన రోడ్డు మీదికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా ప్రకంపనలు సంభవించడంతో ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు.
ఈ రోజు మధ్యాహ్నం సరిగ్గా 1: 24 నిమిషాలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఇస్లామాబాద్ కు పశ్చిమ దిశగా 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించింది. ఉపరితలం నుంచి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఫలకాల్లోో సంభవించిన పెను కదలికల వల్ల భూకంపం చోటు చేసుకున్నట్లు పేర్కొంది. ఇస్లామాబాద్ లో సంభవించిన భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు పాకిస్తాన్ వాతావరణ విభాగం అంచనా వేసింది. యూరోపియన్ మెడిటరేనియన్ భూకంప కేంద్రం ప్రకారం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన అత్తాక్ సమీపంలో సంభవించింది.