Thursday, April 18, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఏది స్వదేశి? ఏది విదేశి?

ఏది స్వదేశి? ఏది విదేశి?

ఏది స్వదేశి?
ఏది విదేశి?
అన్న చర్చకు ఇప్పుడు పెద్ద విలువ ఉండకపోవచ్చు. భౌగోళికంగా దేశానికి కొన్ని సరిహద్దులు తప్పనిసరిగా ఉంటాయి. ఇవే దిశలు. ఆ దిశలు ఉన్నదే దేశం. గుహల్లో చెకుముకి రాళ్లతో మంట రాజేసుకుని వంట వండుకున్న పాతరాతి యుగం నుండి ఇప్పటిదాకా మానవనాగరికత పొరుగు ప్రాంతం, దేశం ప్రభావం లేకుండా వృద్ధి పొందుతోందా?

స్వదేశీ లెక్కలకు విదేశీ గుర్తింపు

మొన్న మొన్నటి శ్రీనివాస రామానుజన్ రోజుల్లో సముద్రయానానికి ఆచారం అంగీకరించలేదు. అప్పట్లో బొంబాయి నుండి లండన్ పడవ ప్రయాణానికి దాదాపు 25 రోజులు పట్టేది. సముద్రం దాటడం ఆచారం ప్రకారం చేయకూడని పని…మహా పాపం…అన్నది శ్రీనివాస రామానుజన్ తల్లి నమ్మకం. భయం. లండన్ వెళ్లకపొతే తన అంతులేని లెక్కల దాహం తీరదన్నది రామానుజన్ తపన. కొన్ని నెలల పాటు తల్లిని ప్రాధేయపడి, చివరికి ఒప్పించాడు. అనంతమయిన సంఖ్యల సూత్రాలను అవలీలగా ఆవిష్కరించిన రామానుజన్ లెక్కలకే ఒక అద్భుతం. ఒక ఆశ్చర్యం. రామానుజన్ మేధను కొలవడానికి మరో రామానుజనే పుట్టాలి.

అంతటి రామానుజన్ మొదట్లో కొన్ని రోజులు ఉద్యోగం చేసినట్లు మద్రాస్ లో గుమస్తా లెక్కలు రాసుకుంటూ ఉండిపోయి ఉంటే లెక్కల ప్రపంచానికి అన్యాయం జరిగి ఉండేది. విదేశీ ప్రయాణానికి, సముద్రం దాటడానికి అయిష్టంగా తల్లి ఒప్పుకుంది. లండన్ అతి శీతల వాతావరణంతో ఆరోగ్యం దెబ్బతిన్నా, శాకాహారిగా తిండికి ఇబ్బంది పడ్డా…రామానుజన్ లెక్కల మేధ పూర్తిగా ఆవిష్కారమయ్యింది మాత్రం లండన్ లోనే.

బ్లడీ కంట్రీ పర్సన్ అని మొదట్లో చిన్నచూపు చూసిన లండన్ మేధో సమాజం…తరువాత ఆయన్ను నెత్తిన పెట్టుకుంది. అభిమానించింది. ఆరాధించింది. యావత్ ప్రపంచానికి రామానుజన్ ను సగౌరవంగా పరిచయం చేసింది. లండన్ వెళ్లినప్పటికి ఆయన వయసు 27. అక్కడ ఉన్నది ఐదేళ్లు. అనారోగ్యంతో భారత్ కు తిరిగి వచ్చిన రామానుజన్ 32 ఏళ్ల వయసులో అనంతమయిన లెక్కల అంతుచూసి అనంతవాయువుల్లో కలిసిపోయాడు. పూర్ణాయుస్సుతో ఇంకొక్క యాభై ఏళ్లు బతికి ఉంటే…రామానుజన్ ముందు యావత్ లెక్కల ప్రపంచం పిపీలికం కంటే కూడా చిన్నది అయిపోయేది. అయినా కారణజన్ముడు. బతికిన ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ భూమి మీదికి వచ్చిన పనిని పూర్తి చేశాడు. వెళ్లిపోయాడు.

విదేశాలకు వివేకం
అమెరికా చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో వివేకానందుడు హిందూ వాణిని సమున్నతంగా వినిపించాడని ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటున్నాం.

వివేకానందకు అక్కడ మాట్లాడే అవకాశం అంత సులభంగా ఏమీ రాలేదు. చివరి వరకు వివేకానందను తప్పించడానికి ప్రయత్నాలు జరిగాయి. ఎలాంటి అడ్డంకులను ఎలా సృష్టిస్తారో? ఎందుకు సృష్టిస్తారో? ఎవరు సృష్టిస్తారో? తెలిసినవాడు కనుక సహనంతో, వివేకంతో వివేకానందుడు వాటిని దాటి చికాగో సమ్మేళనంలో ప్రపంచానికి బోధ చేశాడు.

బెంగాలి, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో వివేకానందుడి జ్ఞానాన్ని కొలవగలిగే తూనికరాళ్ల కోసం ఇంకా మనం వెతుక్కుంటూనే ఉన్నాం. సముద్రయానం, ఇంగ్లీషు, విదేశీ ప్రయాణాల ఆంక్షలేవీ వివేకానందుడికి అడ్డు రాలేదు. రావు.

స్వదేశ విముక్తికి విదేశీ సాయం

నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వదేశ విముక్తి కోసం ఎన్నెన్ని విదేశాల్లో తిరిగాడు? బ్రిటీషువారి కన్నుగప్పి మారు వేషంలో సన్యాసిలా దేశం దాటి…ప్రపంచంలో బ్రిటిషువారిని వ్యతిరేకించే దేశాల సాయం కోసం తిరిగాడు.

కాలిబాటల్లో, ఎడ్ల బండ్లలో, గుర్రబ్బగ్గీల్లో, కార్లలో, విమానాల్లో, చివరికి జలాంతర్గాముల్లో కూడా తిరిగాడు. ఇటు నియంత హిట్లర్ మొదలు అటు జపాన్ దాకా ఆయన తిరిగిన దారి ఒక అద్భుతం.

ఒక సాహసం. 47 కు ముందే పరాయి గడ్డమీద భారత్ కు స్వాతంత్య్రం ప్రకటించిన ధీరుడు…భారత్ కు చేరకముందే అదృశ్యమయ్యాడు. స్వదేశ విముక్తి కోసం విదేశీ సాయాన్ని ప్రోది చేసిన నేతాజీకి మరణం ఉండదు.

గాంధి విదేశాలకు వెళ్లకుండా ఉండి ఉంటే?

గుజరాత్ పోరుబందరులో పుట్టిన మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధి లండన్ లో న్యాయ విద్య చదవకపోయి ఉంటే, దక్షిణాఫ్రికాలో అవమానాల మీద న్యాయవాదన చేయకుండా ఉండి ఉంటే…భారత్ కు వచ్చేవాడా? సత్యాగ్రహం, అహింస, స్వాతంత్ర్య పోరాటంలోకి దిగేవాడా? మనకు మహాత్ముడు అయ్యేవాడా? మన జాతిపిత అయ్యేవాడా?

విదేశీ వస్తు బహిష్కరణ ఇప్పుడు చేయగలమా?
బ్రిటీషు వారికి వ్యతిరేకంగా మహాత్ముడు విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిస్తే అప్పుడు ఆసేతు హిమాచలం పాటించింది. ఇప్పుడు విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపు ఇవ్వగలమా? ఇస్తే పాటించగలమా? పాటిస్తే మన ఇంట్లో, ఒంట్లో మిగిలే వస్తువులెన్ని?

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన మిలటరీ ఆయుధాల తయారీని కూడా నియంత్రిస్తుంటే…ఇక స్వదేశీ నినాదానికి రిలవెన్స్ ఎంతో ఎవరికి వారు అర్థం చేసుకోవాలి.

ఈనాడు- రిలయన్స్- ఫ్యూచర్-హెరిటేజ్-అమెజాన్!
ఒక అకడెమిక్ డిబేట్ కోసం ఈ ఉదాహరణ. ఈనాడు ఇతర భాషల టీ వీ లను రిలయన్స్ కొన్నది. అంతకుముందే రిలయన్స్ పెట్టుబడులు ఈనాడు గ్రూపులో ఉండి ఉండాలి. అదే రిలయన్స్ కిషోర్ బియాని ఫ్యూచర్ గ్రూపులో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఆ ఫ్యూచర్ గ్రూప్ చంద్రబాబు హెరిటేజ్ స్టోర్స్ లో భారీగా పెట్టుబడులు పెట్టింది. అదే ఫ్యూచర్ లో అమెజాన్ అంతకు ముందెప్పుడో నామమాత్రంగా పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్ ను రిలయన్స్ గంప గుత్తగా కొనేసింది. ఫ్యూచర్ మీద అమెజాన్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టుకెక్కింది. కేసు నడుస్తోంది. ఇందులో ఇప్పుడు ఎవరు స్వదేశీ వారసత్వ హిరిటేజ్? ఎవరు విదేశీ వారసత్వ ఫ్యూచర్? ఈనాడు ఈ బంధమేనాటిది? ఏనాడు ముడివేసి పెనవేసినది? చెప్పగలిగే స్వదేశీ నిపుణులెవరు? గుట్టు విప్పగలిగే విదేశీ పెట్టుబడిదారులెవరు?

ఇప్పుడన్నీ నార్త్-సౌత్-వెస్ట్-ఈస్ట్ ఇండియా కంపెనీలే!
ఈస్ట్ ఇండియా కంపెనీ దోపిడీ గురించి, వ్యాపారం పేరుతో మన స్వాతంత్ర్యాన్ని హరించిన దుర్మార్గాన్ని గురించి ఏడు దశాబ్దాలుగా పాఠంగా, కథలు కథలుగా చదువుకుంటున్నాం. ఇప్పుడు ఏయే విదేశీ కంపెనీలు మన దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా నియంత్రిస్తున్నాయో తెలిస్తే…ఈస్ట్ ఇండియా కంపెనీ పాత్ర సముద్రంలో కాకి రెట్టంత కూడా ఉండదు. భవిష్యత్తులో ఈ కంపెనీలు మనల్ను, మన దేశాన్ని ఎలా తమ చెప్పు చేతుల్లోకి తీసుకుంటాయో తెలిసినా ఏమీ చేయలేం.

“Amazon – East India Company 2.0”: RSS-Linked Magazine’s Latest Target

పాంచజన్యం ఎవరిమీద?
రాష్ట్రీయ స్వయం సేవక్- ఆర్ ఎస్ ఎస్ వారపత్రిక పాంచజన్య సంపాదకీయం అంటే ఒక రకంగా కేంద్రంలో బి జె పి ప్రభుత్వానికి దిశా నిర్దేశం. ఆమధ్య ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి స్వదేశీయత మీద పాంచజన్య అనేక అనుమానాలను లేవనెత్తింది. తాజాగా అమెజాన్ మీద విరుచుకుపడింది.

భారతదేశంలో చిన్న చిన్న వ్యాపారులు అమెజాన్ వల్ల వీధిన పడతారని పాంచజన్య ఆందోళన వ్యక్తం చేసింది. అమెజాన్ ఆన్ లైన్ వ్యాపారంతో భారతదేశంలో సంప్రదాయ చిరు వ్యాపారులు నామరూపాల్లేకుండా మట్టికొట్టుకుపోతారని బాధపడుతోంది. అమెజాన్ ను అడ్డుకోవాలని పిలుపునిచ్చింది.

పాంచజన్య పిలుపు పిలుపుగానే మిగిలిపోతుందా? అతి పెద్దది కాబట్టి విదేశీ అమెజాన్ కంటికి కనిపిస్తోంది. కంటికి కనిపించని స్వదేశీ అమెజాన్లు ఎన్నో? అసలు ఏది స్వదేశీ? ఏది విదేశీ? ఎవరిమీద పూరించాలి పాంచజన్యం?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

ఏది ప్రభుత్వం? ఏది ప్రయివేటు?

Also Read:

కలవారికి విదేశం లేనివారికే ఈ దేశం

Also Read:

జీ తెర మరుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్