Thursday, January 23, 2025

తెలుపు- నలుపు

Maths in Medicine: ఏమిటండీ ఇది? మరీ అరాచకం కాకపొతే! అడిగేవాళ్లే లేరా? ప్రాణాలు కాపాడే వైద్య విద్య బోధించే మెడికల్ కాలేజీల మీద ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్– ఈ డి, ఆదాయప్పన్ను- ఐ టీ దాడులేమిటండీ? అదికూడా సరిగ్గా అడ్మిషన్లు జరిగేవేళ మూకుమ్మడి దాడులతో సభ్యసమాజానికి ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారు?

1. పైసా పైసా కూడబెట్టిన సొమ్మును తెలుపుగానో, నలుపుగానో మెడికల్ కాలేజీలకు మూటగట్టి ఇచ్చుకున్నది బాధ్యతగల తల్లిదండ్రులే కదా? మధ్యలో మీకెందుకు బాధ? కందకు లేని దురద కత్తికెందుకు?

2. వైద్య విద్యా బోధనకు కనీస వసతులు, ప్రమాణాలు లేకపోయినా…అర్హత గల ప్రొఫెసర్లు లేకపోయినా…చేతికి డాక్టర్ సర్టిఫికేట్ వస్తే చాలనుకుని కోట్లకు కోట్లు పోసి చేరుతున్నది, చేర్పిస్తున్నది మేమే కదా? మధ్యలో మీ గొడవేంది?

3. మెడికల్ కాలేజీ అంటే కోళ్ల ఫారం రేకుల షెడ్డు కాదు కదా? శవాలను కొనాలి. శవాలను ఐసు పెట్టెల్లో భద్రపరుచుకోవాలి. శవ పాఠాలు చెప్పాలి. మనుషులు శవాలు కాకుండా నిలబెట్టడానికి శవజాగారాలు చేయాలి. కాటికాపరులే గుండె జారి…భయపడి చేతులెత్తేసిన వృత్తిని ప్రవృత్తిగా చేపట్టిన మెడికల్ కాలేజీల ధైర్యానికయినా విలువ ఇవ్వరా?

4. రాజకీయాలను శాసించే స్థాయికి మెడికల్ కాలేజీల యాజమాన్యాల లాభాలు పోగయితే అయి ఉండవచ్చు…అందులో వారి నిస్వార్థ నిష్కళంక నిరామయ నిరుపమాన నిర్వికార నిర్గుణ నిర్వ్యాపార నిర్ణిద్రగానం మీకు వినిపించదా? కనిపించదా?

5. రాజకీయ పార్టీల బడా నాయకులు, ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రతినిధులు మెడికల్ కాలేజీల వ్యాపారంలో ఉంటే ఉండి ఉండవచ్చు. అంతమాత్రాన వారి అకుంఠిత అమేయ అనన్యసామాన్యమయిన వైద్య విద్యా బోధనా మహా యజ్ఞాన్ని చులకన చేస్తారా?

6. ఏదో బ్యాంకుల మీద నమ్మకం లేక ఇళ్లల్లో కోట్ల మూటలు మూలన పడేస్తే…అభినందించాల్సింది పోయి...గుమ్మాల దగ్గర సాయుధులను పెట్టి…తలుపులు మూసి…తలుపు సందుల్లో నుండి తీసిన ఫోటోలను, వీడియోలను మీడియాకు లీకులిచ్చి…అవమానిస్తారా? ఇలాంటివెన్నో చూసి చూసి…గుండె రాయి అయిన వారు కాబట్టి…తట్టుకుని…బతికి బట్టగట్టుకుని…తిరగగలుగుతున్నారు. అదే మనలాగా సున్నిత హృదయులయితే…హరి హరీ…శివ…శివా…ఏమయ్యేది? అమంగళము ప్రతిహతమగుగాక!

Ed Raids Pharma Companies

7. రకరకాల వ్యాపారాలు, రాజకీయ వ్యాపారాలు, వ్యాపార రాజకీయాలు చేసేవారు మెడికల్ కాలేజీలు పెట్టకూడదని రాజ్యాంగంలో ఎక్కడన్నా రాసి ఉందా? లేదే?

8. పొద్దున్నే లేచి…ఇంటింటికీ పాలమ్మి…ఎండనక…వాననక రోడ్లమీద పడి గుమ్మాల మీద న్యూస్ పేపర్లు విసిరిసిరి వేసి వేసి…ఇటుక ఇటుక కొని కొని…పేర్చి పేర్చి…మెడికల్ కాలేజీలు పెడితే…మరో దేశంలో అయితే…నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. ఈ దేశంలో ఇలా అవమానాలకు గురి చేస్తారు.

9. తెలుసుకుంటే…తెలుపు నలుపు కాదు. నలుపు తెలుపు కాదు. నలుపు నగుబాటు కాదు. తెలుపు ఎక్కువ మొత్తంలో చెల్లుబాటు కాదు. ఈ చిన్న లాజిక్ ఐ టీ కి, ఈ డి కి అర్థం కాదు.

10. ప్రాణం పొసే వైద్య విద్యకు…ప్రాణం పెట్టే తల్లిదండ్రులుగా…ప్రాణాలు పోయేంతగా రక్తాన్ని డబ్బు చేసి మేము చదివిస్తుంటే…ప్రాణాలు నిలబెట్టేందుకు వారు ప్రాణాలకు తెగించి…చదువు చెబుతుంటే…మీరు ప్రాణాలు తీస్తారా?

11. కుళ్లు…ఈ డి కి ఒళ్ళంతా కుళ్లు. ఐ టీ కి ఒకటే కుళ్లు. లేకపోతే ఏమిటండీ…ఇది!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్