Eenadu Short Language For CBI In Telugu Abbreviation :
వంశపారంపర్యంగా నాకు తెలుగు భాషాభిమానం అబ్బిందని, మా తాత, నాన్నల పాండిత్యం, అవధానాల వల్ల తెలుగు రుచి తెలిసిందని నాకు గర్వంగా ఉండేది. అజ్ఞానం, అహంకారం, అభినివేశం, ఆత్మజ్ఞానం వేరు వేరు అంశాలు. తెలుగు విషయంలో నాది అభినివేశం లేని అహంకారమని ఈనాడు “కేదస” నిరూపించింది. నా దశ ఆత్మజ్ఞానం లేని అజ్ఞానమని “కేదస” రుజువు చేసింది. ముప్పయ్యేళ్లుగా నేను చదివిన కొద్దిపాటి తెలుగు రోజువారీ పత్రికలు చదవడానికి కూడా పనికిరాదని “కేదస” అవగాహన కలిగించింది. నాకు నాలుగు ముక్కలు తెలుగు తప్ప ఇంకేమీ తెలియదనుకుని సర్దుకున్న తృప్తిని కూడా “కేదస” మిగల్చలేదు. నాకు తెలిసిన ఆ నాలుగు ముక్కల తెలుగు తెలుగే కాదని “కేదస” స్పష్టం చేసింది.
నీరజ్ చోప్రా బంగారు బల్లెం టోక్యో ఒలింపిక్స్ లో గురితప్పక లక్ష్యం ఛేదించిన మరుసటిరోజు ఉదయం…అంటే ఆదివారం గుమ్మంలో పేపర్లు పడిన శబ్దం వినగానే తనివితీరా ఆ వార్తలు చదవాలని పరుగున వెళ్లి ముందు విసిరిన బల్లెం మురిసిన బంగారు మెడల్ గా నీరజ్ మెడలో పడ్డ వార్తలు, ఫోటోలు చదివా, చూశా.
తెలుగు పత్రికల్లో ఈనాడు స్పోర్ట్స్ పేజీ హెడ్డింగ్ దేశానికి “ప్రేమత్రో” నిజానికి చాలా బాగుంది. జావెలిన్ త్రో లో త్రో ఇంగ్లీషు అక్షరానికి వేరే రంగు పెట్టి ప్రేమతో అన్న తెలుగు మాటను వాడుతూ…మంచి విరుపు. ప్రయోగం.
సాక్షి:-
ఆంధ్రజ్యోతి
టైమ్స్
అన్నీ బాగున్నాయి. అర్థవంతంగా ఉన్నాయి. నేనే ఆ బంగారు బల్లెం విసిరినంత తృప్తిగా, గర్వంగా, ఆనందంగా ఫీలయి…ఇక వెళ్లి ఒక కప్పు కాఫీ తాగుదామనుకుంటూ లోపలి పేజీలు తిప్పితే అప్పుడు కనపడింది ఈనాడు ఎడిట్ పేజీ హెడ్డింగ్ లో ఈ “కేదస”.
వృక్ష శాస్త్రానికి సంబంధించిన కేసరాలు;
దశ వికృతి రూపమయిన దస;
ఖేదానికి ఖేద దశ కలిసిన పదబంధం…
అని మనసు పరిపరి విధాల తెలుగు కీడును శంకించింది. తీరా నా కళ్ళజోడు సవరించుకుని జాగ్రత్తగా వార్తలోపలికి వెళితే రన్నింగ్ మ్యాటర్ లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్- సి బి ఐ కి తెలుగులో కేంద్ర దర్యాప్తు సంస్థ అంటారని… ఈ మూడు పదాల మొదటి అక్షరాలు కలిపితే కేదస అవుతుందని చిక్కుముడి విడిపోతుంది. ఈ సూత్రం ప్రకారం కేదసం కావాలి. సున్నాను మింగేయడం మీద “కేదస” గట్టి కేసు కట్టి లోతుగా భాషానేర విచారణ చేసి భాషాభిమానుల హక్కులను రక్షించాలి.
నాకంటే తెలుగు తెలియకపోవడం, కంటి చూపు సమస్యల వల్ల “కేదస” అర్థం కాలేదు కానీ…తెలుగు ప్రజల గుండె చప్పుడు ఈనాడు చెప్పిన పొట్టి తెలుగు కోట్ల మంది గుండె చప్పుడై అర్థమయ్యే ఉంటుంది. ఈనాడు పాఠకులకు ఒకపక్క ఇంగ్లీషు కలిపిన ప్రేమ త్రోలు. మరో పక్క తెలుగును నరికిన పొట్టి అక్షరాల కేదసలు
మముగన్న తల్లి మెడకేదస?
మా తెలుగు తల్లికేదశ?
(Image Credits: Eenadu. Andhra Jyothi, Times of India & Sakshi)
-పమిడికాల్వ మధుసూదన్
Also Read : వాట్సప్ గ్రూపుల్లో వింత లక్షణాలు