Monday, February 24, 2025
HomeTrending Newsకెసిఆర్ పాలన పేదలకు అరిష్టం - ఈటల రాజేందర్

కెసిఆర్ పాలన పేదలకు అరిష్టం – ఈటల రాజేందర్

హుజూరాబాద్ లో ప్రజలు ఓడించారనే కోపంతో.. కెసిఆర్ మానేరు నదిని చెరపట్టారని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఇసుక తవ్వి ఎడారి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. హుజూరాబాద్ లో ఈ రోజు జరిగిన బిజెపి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. 119 నియోజకవర్గాల్లో బీజేపీ పోలింగ్ బూత్ సభ్యుల సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా.. హుజూరాబాద్ నియోజకవర్గం సమావేశంలో పాల్గొన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్  మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో అన్ని సంఘాల భవనాలకు శంకుస్థాపన చేశారని, ఒక్క భవనం కూడా కట్టలేదని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు దొంగలకు సద్ది కట్టే వారని ఆరోపించారు. సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఎక్కడ చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఆ పరిస్థితి రాకుండా మనం అభాగ్యులకు మద్దతుగా నిలబడాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.

ధరణి వల్ల నష్టపోయిన రైతుల తరపున పోరాడుతామని రాజేందర్ హెచ్చరించారు. చచ్చిపోతున్న రైతులు ఎక్కువమంది కౌలు రైతులని, కేంద్రం ఇస్తున్న ఫసల్ భీమా పథకం కూడా మనరాష్ట్రంలో అమలు చేయడంలేదన్నారు. కెసిఆర్ పాలన కొనసాగడం  పేదప్రజలకు అరిష్టమని, మళ్లీ గెలిస్తే చావులు, అణచివేత, హింసించడం తప్పదని అన్నారు. ఇంకా ఎన్నికల యుద్ధం తొమ్మిది నెలలే ఉందని, పార్టీని గెలిపించేందుకు శ్రేణులు సిద్దం కావాలని ఈటల రాజేందర్ పిలుపు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్