రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కెఎస్. జవహర్ రెడ్డి, డిజిపి హరీష్ కుమార్ గుప్తాలను ఢిల్లీ వచ్చి వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. హింసను అరికట్టడంలో సిఎస్, డిజిపిలు విఫలమయ్యారని అభిప్రాయపడింది. రేపు గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు తమకు కలవాలని సూచించింది.
మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో జరిగిన ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని పేర్కొంది. చంద్రగిరిలో స్వయంగా అభ్యర్ధిపై దాడికి పాల్పడినా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలోనూ, పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకురావడంలో కూడా యంత్రాంగం విఫలమైందని ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఎన్నికల సందర్భంగా అల్లర్లు సృష్టించిన నిందితులను రెండ్రోజుల్లో అరెస్ట్ చేస్తామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్ కొనసాగుతుందని, స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పార్టీలకు చెందిన ప్రతినిధి 24 గంటలు ఉండవచ్చని తెలియజేశారు.