Wednesday, January 22, 2025
HomeTrending Newsఅబూజ్‌మడ్‌ లో ఎన్‌కౌంటర్‌... కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల హతం

అబూజ్‌మడ్‌ లో ఎన్‌కౌంటర్‌… కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల హతం

మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. జిల్లాలోని అబూజ్‌మడ్‌ అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడిన నక్సల్స్‌.. భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పోలీసుల ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇరు పక్షాల మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మృతులను గుర్తించాల్సి ఉన్నది.

2026 మార్చినాటికి నక్సల్‌ హింస నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ నెల 25న ప్రకటించారు.  నక్సలిజం వల్ల గత నాలుగు దశాబ్దాల్లో 17,000 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. నక్సల్‌ నేతలను మట్టుబెట్టామని తెలిపారు.

మరోవైపు జమ్ముకశ్మీర్‌ లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు తుదముట్టించాయి.

కుప్వారా మచిల్ సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చారు. అటు కుప్వారాలోనే తంగ్‌ధర్ సెక్టార్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఉగ్రవాది హతమయ్యాడు. బుధవారం రాత్రి తంగ్‌ధర్‌ సెక్టార్‌లో ఉగ్రవాద కదలికలను గుర్తించిన భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతంలో భారీ ఆపరేషన్‌ చేపట్టాయి.

ముష్కరుల కదలికలు కన్పించడంతో మచిల్ సెక్టార్‌లోనూ 57 రాష్ట్రీయ రైఫిల్స్ (RR) అప్రమత్తమై ఆపరేషన్ చేపట్టింది. రెండు ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్‌లో ముగ్గురు టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మరోవైపు, రాజౌరీ జిల్లాలోని లాఠీ గ్రామంలో మూడో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. నలుగురు ముష్కరులు నక్కినట్లు అనుమానిస్తున్నారు. లాఠీ గ్రామం, దంతాల్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్