న్యూజిలాండ్ తో స్వదేశంలో జరుగుతోన్న రెండో టి 20 లోనూ ఇంగ్లాండ్ 95 పరుగులతో ఘన విజయం సాధించింది. మాంచెస్టర్ లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్ద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. లక్ష్య సాధనలో కివీస్ చతికిలపడింది. కేవలం ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్ గస్ అట్కిన్ సన్ 4 వికెట్లతో సత్తా చాటాడు. 13.5 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఓపెనర్ విల్ జాక్స్ (19) జట్టు స్కోరు 40 వద్ద ఔట్ కాగా, డేవిడ్ మలాన్ డకౌట్ అయ్యాడు. ఈ దశలో మరో ఓపెనర్ బెయిర్ స్టో- హ్యారీ బ్రూక్ లు మూడో వికెట్ కు131 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. బ్రూక్ 36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 67 స్కోరు చేసి ఔట్ కాగా, బెయిర్ స్టో 60 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 86 రన్స్ సాధించి అజేయంగా నిలిచాడు.
కివీస్ బౌలర్లలో సోది 2, సౌతీ, శాంట్నర్ చెరో వికెట్ సాధించారు.
కివీస్ 8 పరుగులకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లూ కోల్పోయింది. టిమ్ సీఫెర్ట్-39; గ్లెన్ ఫిలిప్స్-22; మార్క్ చాంప్ మాన్ -15 పరుగులతో మాత్రమే ఫర్వాలేదనిపించారు.
బెయిర్ స్టో కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.
నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో ఇంగ్లాండ్ 2-0 ఆధిక్యంలో ఉంది.