ఎడ్జ్ బాస్టన్ టెస్టులో ఇండియా ఎదురీదుతోంది. ఇంగ్లాండ్ ముందు ఇండియా 378 పరుగుల విజయలక్ష్యం ఉంచగా నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లకు 259 పరుగులతో పటిష్ఠ స్థితిలో ఉంది. విజయానికి ఇంగ్లాండ్ ఇంకా కేవలం 119 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. బెయిర్ స్టో-72; జో రూట్-76 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లు అద్భుతాలు చేస్తే తప్ప ఓటమి గండం తప్పేలా లేదు. ఇండియా ఓటమి పాలైతే సిరీస్ కూడా 2-2 తో డ్రా గా ముగుస్తుంది.
రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లకు 125 పరుగుల వద్ద నేడు నాలుగోరోజు ఆట మొదలు పెట్టిన ఇండియా మరో 120 పరుగులు మాత్రమే జోడించగలిగింది. నిన్న అర్ధ సెంచరీ పూర్తి చేసిన పుజారా 66 పరుగుల వద్ద ఔటయ్యాడు. మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ తో రాణించిన రిషభ్ పంత్ రెండో ఇన్నింగ్స్ లో 57 స్కోరు చేశాడు. ఆ తర్వాత వచ్చినవారిలో రవీంద్ర జడేజా ఒక్కడే 23 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. దీనితో 245 పరుగులకు ఇండియా ఆలౌట్ అయ్యింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ నాలుగు; బ్రాడ్, మ్యటీ పాట్స్ చెరో రెండు; జేమ్స్ అండర్సన్, జాక్ లీచ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ తొలి వికెట్ కు 107 పరుగుల చక్కని భాగస్వామ్యం నెలకొల్పింది. జాక్ క్రాలే 46 పరుగులు చేయగా, వన్ డౌన్ లో వచ్చిన ఒలీ పోప్ డకౌట్ అయ్యాడు. మరో రెండు పరుగులకే మరో ఓపెనర్ అలెక్స్ లీస్ (56) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత జానీ బెయిర్ స్టో- జో రూట్ లు మళ్ళీ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ గాడిలో పెట్టారు.
Also Read : Bairstow Century: ఇంగ్లాండ్ 284 ఆలౌట్- ఇండియా 125/3