మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి, తెలంగాణా రాష్ట్ర సమితికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు అయన మీడియా ముందుకు రానున్నారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం ఉదయం అయన హైదరాబాద్ కు చేరుకున్నారు. నేరుగా శామీర్ పేట లోని తన నివాసానికి చేరుకున్నారు, అప్పటికే అక్కడకు వచ్చిన హుజురాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు, సన్నిహితులతో చర్చలు జరిపారు.
ఈటెల రాజేందర్ ఢిల్లీ లో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి సతీష్ లతో సమావేశం అయ్యారు. నడ్డాతో జరిపిన భేటిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపి వివేక్, ఈటెల సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిలు కూడా ఉన్నారు.
రాజకీయ భవిష్యత్, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీలో తనకు లభించబోయే స్థానం తదితర అంశాలపై ఈటెల బిజెపి అగ్రనేతలతో సమావేశం సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తనతో పాటు పార్టీలో ఏయే నాయకులు చేరతారనే విషయాన్ని కూడా బిజెపి నేతలకు ఈటెల వివరించారు.
పార్టీ అండగా ఉంటుందని, కెసియార్ ప్రభుత్వంపై బిజెపి చేసే పోరాటంలో ఈటెల పాత్ర కూడా ప్రముఖంగా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి.