ములుగు జిల్లా పరిధిలో లక్నవరం, తాడ్వాయి, బొగత అటవీ ప్రాంతాల్లో ఎకో టూరిజం పున: ప్రారంభమైంది. కరోనా కారణంగా నిలిచిపోయిన పర్యావరణ పర్యాటకాన్ని మళ్లీ ప్రారంభించినట్లు అటవీ శాఖ ప్రకటించింది. తొలి దశలో తాడ్వాయి హట్స్ తో పాటు, లక్నవరం, బ్లాక్ బెర్రీ ఐలాండ్స్ దగ్గర సైక్లింగ్, ట్రెక్కింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టినట్లు జిల్లా అటవీ అధికారి కిష్టా గౌడ్ వెల్లడించారు. ఈ పర్యాటక ప్రాంతాలు అన్నీ ఏటూరు నాగారం అభయారణ్యం (వైల్డ్ లైఫ్ శాంక్చురీ) ములుగు జిల్లా పరిధిలోకి వస్తాయి.
తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల పర్యాటకులను ఆకర్షించే పర్యాటక ప్రాంతాల్లో లక్నవరంతో పాటు, బొగత జలపాతం ప్రాంతాలు ఉన్నాయి. వీటితో పాటు చుట్టుపక్కల అడవిలో అనేక దర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి. రాజధాని నుంచి సుమారు 250 కిలో మీటర్ల దూరం, ఐదున్నర గంటల ప్రయాణంతో ఇక్కడికి చేరుకోవచ్చు. రాత్రి బసకు లక్నవరం దగ్గర టూరిజం హోటళ్లతో పాటు, తాడ్వాయిలో అటవీశాఖ హట్స్ అందుబాటులో ఉన్నాయి. లక్నవరం, తాడ్వాయి, బొగత చుట్టు పక్కల ప్రాంతాలను కలిపి రెస్పాన్సిబుల్ ఎకో టూరిజం (బాధ్యతాయుతమైన పర్యావరణ పర్యాటకం) సర్క్యూట్ ను అటవీ శాఖ అభివృద్ది చేస్తోంది.
వీటిని సందర్శించాలనుకునే పర్యాటకుల కోసం తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను లక్నవరం ఫెస్టివల్ పేరుతో గతంలో అమలు చేసింది. అయితే కరోనా కారణంగా రెండేళ్లకు పైగా ఈ కార్యక్రమాలు నిలిచిపోయాయి. తాజాగా ఇప్పుడు పున:ప్రారంభం జరిగింది.
ఈ ప్రాంతాల చుట్టూ పరుచుకున్న అటవీ ప్రాంతాలు, పారే నదులు, నీటి కొలనులు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయి. అడవిని అర్థం చేసుకోవటంతో పాటు, ప్రాధాన్యతను తెలిపేలా కొత్త కార్యక్రమాల రూపకల్పన జరిగింది. అడవుల ప్రాధాన్యతను అర్థం చేసుకోవటంతో పాటు, అటవీశాఖ నేతృత్వంలో అడవుల నిర్వహణపై కూడా పర్యాటకులకు అవగాహన కల్పించనున్నారు. గడ్డి మైదానాల పెంపు (గ్రాస్ లాండ్స్), సోలార్ బోర్ వెల్స్, నీటి యాజమాన్య పద్దతులు (పర్కులేషన్ ట్యాంక్స్) స్థానిక అటవీ అధికారులు వివరిస్తారు.
ప్రస్తుతం లక్నవరంతో పాటు తాడ్వాయి హట్స్ దగ్గర రెండు నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో అటవీ అందాలను వీక్షించేందుకు వీలుగా ట్రెక్కింగ్, సైక్లింగ్ ప్రారంభమైంది. ఒక గంటకు వంద రూపాయలు చెల్లించి సైక్లింగ్ అనుభూతిని ఇక్కడ పొందవచ్చు. దారిలో లక్నవరం అలుగు, తూములు, వాచ్ టవర్ నుంచి బర్డ్ వాచింగ్, అటవీ, సరస్సు అందాలను వీక్షించవచ్చు. అటవీశాఖ ద్వారా గైడ్ కూడా అందుబాటులో ఉంటారు. తాడ్వాయి సమీపంలో ఉన్న బ్లాక్ బెర్రీ ఐలాండ్ (రివర్ ఐలాండ్), డోల్మెన్ సమాధులు (పురాతన రాకాసి గుహలు)ను కూడా సందర్శించవచ్చు. లక్నవరం సమీపంలో ఒక రాత్రి టెంట్ లో బసచేసేలా మొత్తం 24 గంటలు ప్యాకేజీ త్వరలో అందుబాటులోకి రానుంది.
తడ్వాయి హట్స్ నుంచి సఫారి వాహనంలో 20 కిలో మీటర్లు ఐలాపూర్ వరకు దట్టమైన అటవీ ప్రాంతంలో సంచరించే అవకాశముంది. అటవీశాఖ తరపున సఫారీ వాహనం అందుబాటులో ఉంటుంది. అన్ని అటవీ ప్రాంతాలను ప్లాస్టిక్ ఫ్రీ జోన్లుగా ప్రకటించామని, సందర్శకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు కోరారు. వివరాల కోసం లక్నవరం – 8074827875, తాడ్వాయి 7382619363 నెంబర్ లలో సంప్రదించవచ్చు.
తెలంగాణ అటవీ ప్రాంతాల్లో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటి సందర్శనకు వీలుగా తగిన కొత్త ఎకో టూరిజం పాలసీ రూపకల్పన జరుగుతోందని, ప్రభుత్వ అనుమతితో త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్ & హెచ్ఓఓఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్ వెల్లడించారు.