Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపూనకాలు ఫుల్ లోడింగ్ - డౌన్ ఫాల్ నో స్టాపింగ్

పూనకాలు ఫుల్ లోడింగ్ – డౌన్ ఫాల్ నో స్టాపింగ్

No Change:
తెలుగు సినిమా మారిపోయింది.
తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది.
తెలుగు సినిమా వైపు మొత్తం ప్రపంచం చూస్తోంది.
దేశానికే తెలుగుసినిమా దారిచూపిస్తోంది.
అటు సినిమావాళ్ళు, ఇటు జర్నలిస్టులు ఎక్కడ పడితే అక్కడ వాడేసే స్టేట్మెంట్లివి.
అవునా! నిజమా! తెలుగు సినిమా మారిపోయిందా?
ప్రపంచస్థాయికి చేరుకుందా?

Raja Mouli Sequel Rrr
అంతా మీ భ్రమ.
ఒక రాజమౌళి మార్చేసే వ్యాపారం కాదిది.
ఒక సుకుమార్ డిసైడ్ చేసే బిజినెస్ కాదిది.
ఇలాంటి ప్రయత్నాలు, ప్రయోగాలు, ప్రత్యామ్నాయాలు చాలాచూసాం.
వందేళ్లు దాటిన తెలుగు సినిమాని ఎవరూ మార్చలేకపోయారు.
అసలు మారనివ్వరు.
ప్రేక్షకులు, అందులో ఫాన్స్ ..
స్టార్లు, వారి భజన బృందం
తెలుగుసినిమా త్రేతాయుగం దాటి రాకుండా జాగ్రత్తపడతారు.


ఎప్పుడో ముప్పైవ దశకంలో మాలపిల్ల వచ్చినప్పుడు అదొక సంచలనం.
జనం తెగ చూసారు. సినిమా సూపర్ సక్సెస్ అయింది.
ఇంకేముంది? తెలుగు సినిమా మారిపోయిందనుకున్నారు.
పౌరాణికాల పని అయిపోయిందనుకున్నారు.
అట్టడుగు కులాలను తెలుగుసినిమా పట్టించుకుంటుందనుకున్నారు.
ఏమైనా మారిందా?
మరో ఇరవైయేళ్ళు పౌరాణికాలదే పైచేయి అయింది.

యాభైల్లో విజయా వాళ్ళసినిమాలు మళ్ళీ కాస్త ఆశలు రేకెత్తించాయి.
అప్పటికే ముదిరిపోయిన సెంటిమెంట్లు,
ముక్కిపోయిన పురాణకాలక్షేపాలకు ఇక ఫుల్ స్టాప్ అనుకున్నారు. ఏమైనా మారిందా?

60లలో కృష్ణ కాస్త ధైర్యం చేసి గూఢచారులు, అవేకళ్ళు మొదలుపెట్టాడు.
దాంతో తెలుగు సినిమాకి హాలీవుడ్ కళలు వచ్చేశాయనుకున్నారు.. నిజంగా వచ్చిందా?
70లలో సినిమా మరింత దిగజారింది.
80లు శంకరాభరణంతో మొదలైనప్పుడు విశ్వనాధ శకం మొదలైంది.
శాస్త్రీయకళలు, సనాతన ధర్మాలు వెండతెరకెక్కాయి.
ఇదిగో ..ఇక ఇదే సినిమా దారి అనుకున్నారు.
ఒకరిద్దరు దర్శకులు ఆయన్ని అనుకరించారు కూడా..
కానీ, అదేమీ ధోరణి కాలేదు.
తెలుగు సినిమాకి దారి కాలేదు.
అటు తమిళనాడు నుంచి భారతీరాజా, బాలచందర్ లు వచ్చి కాసేపు మన సినిమాని కన్ఫ్యూజ్ చేశారు.

కానీ, మనమేమీ మారలేదు.
మన వెండితెర పాతాళానికి దారి వెతుక్కుంటూనే వుంది.
అంతలోనే ఒక వైపు టీ కృష్ణ, మరో వైపు మాదాల , ఇంకో వైపు నరసింగరావులు విరుచుకుపడ్డారు.
విప్లవం, పోరాటాలు, తిరుగుబాట్లు, తెరపై చోటు కోసం పోటీ పడ్డాయి.
అయినా తెలుగు సినిమా మారలేదు.
మారకుండా సూపర్ స్టార్లు, మెగాస్టార్లు శాయశక్తులా అడ్డుపడ్డారు.

 

శివతో 80లకు వీడ్కోలు చెప్పిన రామ్ గోపాల్ వర్మ తెలుగుసినిమాని మార్చేస్తాడేమో అని భయమేసింది.
కానీ, కాలం ఆర్జీవినే పతనం చేసింది తప్ప మన సినిమాని ఏం చేయలేకపోయింది.
మధ్యలో వచ్చిన బాపు , వంశీ ఫ్రేములు మార్చారే తప్ప సినిమా ఫేటుని మార్చలేకపోయారు.
ఆ తర్వాత శతాబ్దం మారినా సినిమా స్టోరీ స్క్రీన్ ప్లేలు ఏమాత్రం మారలేదు.
అడపదడపా వచ్చే శేఖర్ కమ్ముల లాంటి మెరుపులు తప్ప మూసని కదిలించే సినిమాలేం రాలేదు.
అలా ఈ శతాబ్దంలో ఇరవైయేళ్ళు గడిచిపోయాక..
ఇప్పుడు మళ్లీ రాజమౌళిని చూసి అనవసర భ్రమలు పెట్టేసుకుంటున్నాం.
ఇప్పటికే రాజమౌళిని అనుకరించి ఒకరిద్దరు బాగా దెబ్బైపోయారు.


కాబట్టీ మళ్లీ ప్రయోగాలు వదిలేసి పాతచింతకాయ జాడీలను కిందకు దించుతున్నారు..
తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుందని మీకింకా అపోహలేమైనా వుంటే..
ఈ పండగకి రిలీజ్ అయిన రెండు సినిమాలూ చూసేయండి.
కాలం, కేలండర్.. ఏవీ మన సినిమాని అంగుళం కూడా జరపలేవని అర్థమవుతుంది.
సంవత్సరాలు, శతాబ్దాలు… మన సినిమాను పాతాళం నుంచి పైకి తీసుకురాలేవని జ్ఞానోదయమవుతుంది.

-శివప్రసాద్

RELATED ARTICLES

Most Popular

న్యూస్