బీ ఆర్ ఎస్ జాతీయ అధ్యక్షులు కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి లను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని బీ ఆర్ ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై యుద్ధాన్ని ప్రకటించారు. ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ.. దూకుడు పెంచారు. తన తరఫున అభ్యర్థులను ప్రకటిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజవర్గానికి టీఆర్ఎస్ నుంచి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు ఓడిపోగా… హర్షవర్ధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అధికార పార్టీలో చేరారు. ఇక అప్పటి నుంచి జూపల్లి, హర్షవర్ధన్ కు అస్సలు పడడం లేదు. వాళ్లిద్దరూ ఒకే పార్టీలో ఉన్నా.. ఆధితప్య పోరు కొనసాగుతోంది. జూపల్లి, హర్షవర్ధన్ రెడ్డిల మధ్య పంచాయతీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లింది. చాలా సార్లు బహిరంగంగానే ఇద్దరు నేతలు విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు జూపల్లి దూరంగా ఉంటున్నారు. ఈసారి సిట్టింగులకే టిక్కెట్లు ఇస్తానని కేసీఆర్ ప్రకటించడంతో.. జూపల్లిలో అసంతృప్తి ఇంకా పెరిగింది.