Saturday, November 23, 2024
HomeTrending Newsకరెంటు చార్జీల పెంపునకు కసరత్తు

కరెంటు చార్జీల పెంపునకు కసరత్తు

 Electricity Charges In Telangana :

రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా రాష్ట్రంగా పేరొందిన తెలంగాణలో డిస్కమ్ లు నష్టాలను పూడ్చుకునే పనిలో నిమగ్నమయ్యాయి. వరుసగా మూడో రోజు విద్యుత్ యాజమాన్యాలతో మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి,టి.హరీష్ రావులు ఇదే అంశంపై సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాల ధరలతో పోల్చి చూసినట్లు తెలిసింది. ట్రాన్స్కో&జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు,టి యస్ యస్ పి డి సి ఎల్ సి యం డి జి. రఘుమారెడ్డి,జే యం డి శ్రీనివాసరావు టి యస్ యస్ పి డి సి ఎల్ డైరెక్టర్ శ్రీనివాస్,స్వామిరెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. 50 యూనిట్ల లోపు విద్యుత్ ను వినియోగించుకున్న వారికి కేవలం 1.45 పైసలకే యూనిట్ విద్యుత్ అందిస్తూ దిగువ, మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్గిస్తున్న సంస్థలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి సంవత్సరం 1253 కోట్ల తో కలిపి 10,000 కోట్లు రూపాయలను సబ్సిడీ రూపంలో అందిస్తున్నా విద్యుత్ పంపిణీ సంస్థలకు నష్టాలు తప్పడం లేదు అని అధికారులు అభిప్రాయపడ్డారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు దిగువ మధ్యతరగతి గృహ వినియోగదారులకు అదీ 50 యూనిట్ల లోపు విద్యుత్ ను వినియోగించుకుంటున్న వారి నుండి తెలంగాణ రాష్ట్రం లో కేవలం 1.45 పైసలు వసూలు చేస్తుండగా ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో అదే 50 యూనిట్ల లోపు వినియోగించుకునే వారి నుండి 3.30 పైసలు,ఉత్తరప్రదేశ్ లో మూడు రూపాయలు,పంజాబ్ లో 3.49 పైసలు, అత్యధికంగా పశ్చిమ బెంగాల్ లో 4.02 రూపాయలు వసూలు చేస్తున్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.
ఈ క్రమంలో ఇదే విషయంలో మరింత లోతుగా సమీక్ష నిర్వహించిన మంత్రులు 100 యూనిట్ల విద్యుత్ ను వినియోగించుకునే వినియోగదారుల సరాసరి బిల్లు తెలంగాణలో 239 రూపాయలుగా ఉంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లో 861 రూపాయలు బిజెపి పాలిత కర్ణాటక లో 702,పశ్చిమ బెంగాల్ లో 759,మహారాష్ట్ర లో 677,గుజరాత్ లో 601 రూపాయలు,కేరళ రాష్ట్రంలో 476,పంజాబ్ లో 473 ఉత్తరప్రదేశ్ లో 457 వసూలు చేస్తున్న అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది.
అంతే గాకుండా కుల,మతాలకు అతీతంగా 200 యూనిట్ల విద్యుత్ లోపు వాడుతున్న వినియోగదారులకు సబ్సిడీలు అందించి తెలంగాణా లో కేవలం నెల ఒక్కింటికి 200 యూనిట్లు వినియోగిస్తున్న వారి నుండి 822 రూపాయలు వసూలు చేస్తున్న విషయం విదితమే. ఇదే అంశాన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మహారాష్ట్ర లో అదే 200 లోపు యూనిట్లు వినియోగించుకుంటున్న వినియోగదారుల నుండి అత్యధికంగా 1689రూపాయలు,రాజస్థాన్ లో 1666,పశ్చిమ బెంగాల్ లో 1630,కర్ణాటక లో 1556,మధ్యప్రదేశ్ 1427,గుజరాత్ లో 1285 కేరళ లో 1224 రూపాయలు వసూలు చేస్తున్న అంశాన్ని పరిశీలించారు.
తెలంగాణ డిస్కమ్ లు ఒక్కో యూనిట్ సరఫరా వ్యయం 7.24 పైసలు పడుతుండగా 50 యూనిట్ల లోపు వినియోగదారులకు1.45 పైసలు 100 యూనిట్ల వరకు 2.60 పైసలు 200 యూనిట్ల 4.30 పైసలు మాత్రమే గృహ వినియోగదారుల నుండి వసూలు చేస్తున్న విషయం విదితమే.సరఫరా వ్యయానికి గృహ వినియోగదారులు చెల్లించే మొత్తాలలో గల వ్యత్యాసాన్ని తెలంగాణా ప్రభుత్వం భరిస్తున్నది. ఉదాహరణకు సబ్సిడీ లేక పోతే 50 యూనిట్లు వినియోగించుకుంటున్న గృహ వినియోగదారులు చెల్లించాల్సిన మొత్తం 362 రూపాయలు, కానీ 101 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నది.అంతే గాకుండా 100 యూనిట్లు వినియోగించే వినియోగదారులు ప్రస్తుతం చెల్లించేది కేవలం 239 రూపాయలు మాత్రమే,అదే సబ్సిడీలు లేకుంటే వారు చెల్లించాల్సింది 724 రూపాయలకు ఉంటుంది.

అదే విదంగా వ్యవసాయ వినియోగదారులకు 24 గంటలు ఉచిత నాణ్యమైన నిరంతర విద్యుత్ ను అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించింది. వ్యవసాయ రంగానికి అందిస్తున్న విద్యుత్ ను సైతం దేశంలోని బిజెపి,కాంగ్రెస్ రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఆ రాష్ట్రాలు నెలవారీ బిల్లులు వసూలు చేస్తున్నప్పటికీ 24 గంటల విద్యుత్ సరఫరా ఎక్కడా లేదు.ప్రధాని మోడీ రాష్ట్రం గుజరాత్ లో డబ్బులు వసూలు చేస్తూన్నా విద్యుత్ సరఫరా చేస్తున్నది కేవలం 9 గంటలే.అదే గుజరాత్ లో 9 గంటలు విద్యుత్ నుపయోగించుకున్నందుకు ఒక్కో రైతు నుండి ఒక్కో మోటారు కనెక్షన్ నుండి నెలకు 667 రూపాయలు వసూలు చేస్తుండగా అదే 9 గంటలు సరఫరా చేస్తున్న ఉత్తరప్రదేశ్ లో నెలకు 2408, ఇతర రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్ లో నెలకు 4558, మహారాష్ట్ర నెలకు 1609, ఏడు గంటలు మాత్రమే విద్యుత్ నందిస్తున్న రాజస్థాన్ లో 1800 లు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.అదే విదంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్న కేరళలో 9 గంటలు విద్యుత్ ను వినియోగించుకున్నందుకు గాను ఒక్కో వ్యవసాయ కనెక్షన్ కు నెల ఒక్కింటికి 2952 రూపాయలు వసూలు చేస్తున్నారు.
తెలంగాణలో పరిశ్రమల రంగానికి దేశంలోని తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీ,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు తెలంగాణ డిస్కమ్ లు తక్కువ ధరలకే నాణ్యమైన విద్యుత్ నందిస్తున్న విషయం పై కూడా ఈ సమీక్ష లో చర్చ జరిగింది.

Also Read : ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రతిపాదన

RELATED ARTICLES

Most Popular

న్యూస్