తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా కేంద్రంలోని ఓ పటాసుల ఫ్యాక్టరీలో పేలుళ్లు సంభవించి, భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మరో 16 మంది గాయాలతో కృష్ణగిరిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భవన శిథిలాల కింద మరో ఐదుగురు చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
కాగా, మృతుల్లో క్రాకర్స్ ఫ్యాక్టరీ ఓనర్ రవి, ఆయన భార్య జయశ్రీ, కుమార్తె, రుతిక, కుమారుడు రుతీష్ ఉన్నారు. వారితోపాటు ఫ్యాక్టరీ పక్కనే హోటల్ నడుపుతున్న రాజేశ్వరి, వెల్డింగ్ షాప్ నిర్వహిస్తున్న ఇబ్రహీమ్, ఇమ్రాన్, వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న సరసు, జేమ్స్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. కాగా, మొత్తం 15 మంది క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, మరో వ్యక్తిని భవన శిథిలాల నుంచి ప్రాణాలతో వెలికితీశారని అధికారులు తెలిపారు.
స్థానికంగా పనిచేసే మరో ఐదుగురి జాడ తెలియకపోవడంతో వారు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వారిని సురక్షితంగా బయటికి తీసేందుకు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. శనివారం ఉదయాన్నే ఒక్కసారిగా పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే ఘటనా ప్రాంతంలో క్షతగాత్రుల హాహాకారాలు, కుటుంబసభ్యుల ఆర్తనాదాలు మొదలయ్యాయి.