కుండపోత వానలు, ఎగువ ప్రాంతాలా నుంచి వస్తున్నా నీటి ప్రవాహం తోడుకావటంతో బంగ్లాదేశ్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. గత మూడురోజులుగా పడుతున్న వర్షాలకు ఈశాన్య, ఉత్తర ప్రాంతాల్లో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదల వల్ల గత వారం రోజుల వ్యవధిలో.. 20 మంది చనిపోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం,తాగునీటి సరఫరా సంక్లిష్టంగా మారింది. లక్షల మంది ప్రజలు విద్యుత్ లేకుండా చీకటిలోనే ఉన్నారు. వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న సునమ్‌గంజ్, సిల్హెట్ జిల్లాల్లో దాదాపు లక్షమంది ప్రజలను సురక్షిత ప్రాంతలకు తరలించినట్లు. బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది.
బంగ్లాదేశ్‌లో వరద బీభత్సం
వరదలతో 40 లక్షల మంది ప్రజలు ప్రభావితం అయ్యారని పేర్కొంది. భారీ వర్షసూచన ఉన్నందున ఉత్తర బంగ్లాదేశ్‌లోని ప్రధాన నది తీస్తా ప్రమాదకరస్థాయిని మించి ప్రవహించే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. దేశంలోని ఉత్తరాది జిల్లాల్లో పరిస్థితి మరింత దిగజారవచ్చని వివరించింది. ఈశాన్య జిల్లాల్లో వరద ఉద్ధృతి తగ్గిందని, అయితే వర్షపు నీరు బంగాళాఖాతంలోకి చేరే మార్గంలోని ప్రాంతాలకు.. ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
వర్షాల కారణంగా వేల సంఖ్యలో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక మీడియా వివరించింది. సహాయక చర్యల కోసం సైన్యాన్ని సైతం రంగంలోకి దించారు. 16 కోట్ల జనాభా గల బంగ్లాదేశ్ వాతావరణ మార్పులతో అధ్వానంగా తయారై వరదలు, తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాలకు ఎక్కువగా ప్రభావితమవుతోంది.
ఇదే స్థాయిలో గ్లోబల్ వార్మింగ్ కొనసాగితే రాబోయే దశాబ్దకాలంలో బంగ్లాదేశ్‌లో సుమారు 17శాతం మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.