Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనేను బతికే వున్నా

నేను బతికే వున్నా

Fake News on Social media hurting the people

ఎంత గడ్డు కాలమిది?
ఎంత చెడ్డ కాలమిది?
ప్రాణం పోవడం కంటే పెద్ద విషాదం ఇది.
ప్రాణం తీయడం కంటే పెద్ద నేరం ఇది.
హంతకులకంటే వీళ్ళు తక్కువేం కాదు.
నెత్తురు తాగే రాక్షసులు కంటే మెరుగైన వాళ్లేం కాదు.
ఒక జీవితానికి సంబంధించిన విషయం కదా!
ఒక కుటుంబాన్ని కలిచేసే బాధ కదా!
అభిమానించే వాళ్ళుండొచ్చు!
ఆధార పడేవాళ్ళుండొచ్చు!
తట్టుకోలేక గుండెలు పగిలే వాళ్ళుండొచ్చు.
ఏమంత తొందరని?
ఒక్క క్షణం ఆలస్యమైతే ఏం మునిగిపోతుంది?
నిజమో అబద్ధమో తేలేదాకా ఆగితే ఏమైపోతుంది?

అరవై డెబ్బై ఏళ్లు మన మద్యే వున్న వాళ్లు.
తెరపైనో…తెరవెనుకో…లక్షలాది మందిని అలరించిన వాళ్ళు.
జనంలో వుండి, జనంలో గెలిచిన వాళ్ళు.
బతికుండగానే చనిపోయారని రాసేవాళ్ళు సైకోలు కాదా!
చావువార్త కూడా అందరికన్నా ముందుచెప్పాలన్న ఆత్రం శాడిజం కాదా?
ఒకడొవడో రాసాడు సరే..
దాన్ని పదిమందికిపంపే వాళ్ళకైనా బుద్దుండాలి కదా?
ఒకడు కాదు ఇద్దరు కాదు..
గజానికొక సైకో తయారయ్యారు.
ఒక చేతిలో మొబైల్.. అందులో వాట్సప్..ఇదొక డెడ్లీ కాంబినేషన్.
ఊపిరుండగానే.. చంపేసే దిక్కుమాలిన కాంపిటీషన్.మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇలాంటి పనులుచేసేది.
చావుబతుకుల్లో వున్న సెలెబ్రిటీలు, నాయకులు చనిపోకముందే..చంపేసేది.
వాజ్ పేయి ఆస్పత్రిలో వుండగానే ఎలిజీలు రాసేసిన పత్రికలున్నాయి.
సుమిత్రా మహజన్ చనిపోయారని అబద్ధపు బ్రేకింగ్ న్యూస్ లు నడిచాయి.
ఎస్పీ బాలు బతికుండగానే.. నేను బతికున్నా అని చెప్పుకోవాల్సి వచ్చింది.
వేణుమాధవ్ ని సోకాల్డ్ సోషల్ మీడియా చంపేసాక.. మళ్ళీ బతికొచ్చాడు.
బతికున్నానురా బాబూ.. అని బతిమాలుకున్నాడు.
ఇలా.. చెప్పుకుంటూ పోతే మీడియా హత్యల జాబితా.. చాంతాడంత వుంటుంది.

Fake News On Social Media

ఇప్పుడు శారద వంతు వచ్చింది.
ఆవిడ బతుకేదో ఆవిడ బతుకుతోంది.
నటిగా ఊర్వశి అనిపించుకుంది
ఇప్పుడు విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతోంది.
ఎవరి మెదడుని ఏ వైరస్ తొలిచిందో?
ఎవరి చెవికి ఏం కరోనా వచ్చిందో తెలియదు కానీ..
వున్నట్టుండి.. ఆమె లేరని ఒక వార్త సృష్టించారు.
అంతే.. క్షణాల్లో ఆ వార్త ప్రపంచమంతా పాకి.. చివరికి ఆమె దగ్గరకే చేరింది.
పాపం.. ఎన్నోపాత్రలకు ప్రాణం పోసిన శారద..
ఇవాళ తన ప్రాణం పోలేదని చెప్పుకోవాల్సి వచ్చింది.
ఇదైనా ఆఖరి అబద్ధం అవుతుందా?

-కే.శివప్రసాద్

Also Read : వాట్సప్ గ్రూపుల్లో వింత లక్షణాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్