Sunday, January 19, 2025
HomeTrending Newsసింగరేణి ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు - ప్రధాని మోడీ

సింగరేణి ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు – ప్రధాని మోడీ

సింగరేణిని ప్రైవేటు పరం చేస్తున్నామని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సింగరేణిలో 51శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానికుందన్నారు. మెజార్టీ వాటా రాష్ట్రానిది అయితే కేంద్రం ఎలా విక్రయిస్తుందని ప్రశ్నించారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదని మోడీ స్పష్టం చేశారు. కేంద్రం తరపున ఎలాంటి ప్రైవేటీకరణ ప్రతిపాదన లేదని తేల్చి చెప్పారు.

రామగుండంలో ఈ రోజు ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకింతం చేసిన ప్రధానమంత్రి ఆ తర్వాత, పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… ఓ వైపు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూనే మరోవైపు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.

రామగుండం ఎరువుల కర్మాగారానికి 2016లో శంకుస్థాపన చేశామని, తాజాగా దాన్ని పూర్తిచేసి జాతికి అంకితం చేశామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. తొలుత ఆర్‌ఎఫ్‌సీఎల్‌ సందర్శించారు. రూ.2,268 కోట్లతో మెదక్‌-సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి విస్తరణ పనులు, బోధన్‌-బాసర-భైంసా, సిరొంచా – మహాదేవ్‌పూర్‌ జాతీయ రహదారి విస్తరణ పనులకుఈ సందర్భంగా మోడీ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫర్టిలైజర్‌ ప్లాంట్‌, రైల్వేలైన్‌, రోడ్ల విస్తరణతో తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందని, కొత్త ప్రాజెక్టులతో జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. 8 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకే ప్రాధాన్యం ఇచ్చామని, శంకుస్థాపనలకే తాము పరిమితం కాలేదని, వాటిని వేగంగా పూర్తి చేసి చూపించామన్నారు. యూరియాను విదేశాల నుంచి అధిక ధరకు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని, అయినప్పటికీ రైతులకు ఎరువుల కొరత రాకుండా అనేక చర్యలు చేపట్టినట్లు మోడీ చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక యూరియా కొరత లేకుండా చూశామని, భవిష్యత్‌లో భారత్‌ యూరియా పేరితో ఒకటే బ్రాండ్‌ లభ్యమవుతుందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళి సై, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్‌, కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌, బీజేపీకి చెందిన ఇతర నాయకులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్