Q.మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నేను ఈ మధ్యే బీటెక్ పూర్తిచేశాను. చూడటానికి సన్నగా, పొట్టిగా చిన్నపిల్లలా ఉంటాను. ఏదన్నా ఉద్యోగం చేద్దామన్నా ఎవరూ ఇవ్వరేమో అనిపిస్తుంది. ఇక ఇంట్లో పరిస్థితి…అమ్మానాన్నా ఎప్పుడూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళనలా చూస్తుంటే కోపం వస్తుంది. అందుకేనేమో ఎవరన్నా కోపం తెప్పిస్తే గట్టిగా అరిచేస్తాను. దాంతో ఎవరూ సరిగా మాట్లాడరు. పై చదువులకు వెల్దామంటే ఇంట్లో డబ్బు ఇవ్వరు. ఎలాగో వెళ్లినా ఈ బాధలతో చదవలేననిపిస్తుంది. మా నాన్న ఉద్యోగం చెయ్యి అంటున్నారు. ఏం చెయ్యాలో తోచడం లేదు.
-లలిత
A.డిగ్రీ పూర్తిచేశారు. ఈ పాటికి మీ శక్తిసామర్ధ్యాలపై నమ్మకం రావాలి. అలా కావడం లేదంటే లోపం మీదే. అమ్మానాన్నలు పోట్లాడుకుంటే చూస్తూ ఈ జీవితమింతే అనుకుంటారా? వీలయితే వాళ్ళని చక్కదిద్దుతూ మీ భవిష్యత్తుకు బాట వేసుకుంటారా? సన్నగా చిన్నగా ఉండటం వల్ల ఉద్యోగాలు రాకపోవడమంటూ ఉండదు. మీకు మీరే నిర్ణయించుకుని ఇంట్లో కూర్చున్నట్టున్నారు. ఇంట్లోంచి బయట కాలు పెడితేనే మీకు మంచిది. అందుకు ఉద్యోగమో, చదువో ఏదైనా పర్వాలేదు. అమ్మానాన్నల దగ్గర ఎవరితో చనువుంటే వాళ్ళతో మీ భావాలు పంచుకోండి. వీలయితే సూచనలూ ఇవ్వచ్చు. వీటన్నిటికీ సంకల్పం ఉండాలి. ఎంతదూరమైనా అడుగే ప్రారంభం. మీ చదువు, విజ్ఞత అందుకు పునాది కావాలి. ఆ దిశగా ఆలోచించండి. మీ బలహీనత(కోపం) మీకు తెలుసు కాబట్టి అధిగమించడం కష్టం కాదు. ఆల్ ది బెస్ట్.
-కె.శోభ,
ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్,
[email protected]