Monday, March 31, 2025
Homeసినిమా'ఫ్యామిలీ స్టార్' విజయ్ దేవరకొండకి ఓ పరీక్షనే! 

‘ఫ్యామిలీ స్టార్’ విజయ్ దేవరకొండకి ఓ పరీక్షనే! 

విజయ్ దేవరకొండకి చాలా కాలంగా హిట్ లేదు. ఆయన నుంచి వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ .. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలు పరాజయాలను అందుకున్నాయి. కొన్ని కారణాల వలన కొంత గ్యాప్ తరువాతనే ఆయన నుంచి ‘లైగర్’ వచ్చింది. అయితే గతంలో వచ్చిన రెండు ఫ్లాపుల ప్రభావం ఈ సినిమాపై అంతగా చూపించలేదు. అటు పూరి ఇమేజ్ .. ఇటు విజయ్ దేవరకొండకి గల క్రేజ్ కారణంగా ఈ సినిమా భారీ అంచనాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.

‘లైగర్’పై పెంచుతూ వచ్చిన అంచనాలు .. ఆ సినిమాను పాన్ ఇండియా సినిమాగా ప్రమోట్ చేయడం వలన ఎక్కువ ఎఫెక్ట్ పడింది. అయితే ఈ యాక్షన్ సినిమా ఫ్లాప్ నుంచి బయటపడాలంటే, వెంటనే ఓ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో  విజయ్ దేవరకొండ ‘ఖుషీ’ సినిమా చేశాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, విజయ్ దేవరకొండ జోడీగా సమంత నటించింది. టైటిల్ కి గల క్రేజ్ కారణంగా ఈ సినిమాపై కూడా గట్టిగానే అంచనాలు ఏర్పడ్డాయి. రొమాంటిక్ కామెడీ జోనర్లో వచ్చిన ఈ సినిమా కూడా ఆడియన్స్ ను నిరాశపరిచింది.

ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఆలోచనలో పడ్డాడు. దిల్ రాజు నిర్మాణంలో .. పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా చేస్తున్నాడు. తనకి ‘గీత గోవిందం’ సినిమాతో భారీ విజయాన్ని అందించిన ఈ డైరెక్టర్ పై విజయ్ దేవరకొండ నమ్మకం పెట్టుకున్నాడు.  మృణాల్ ఠాకూర్ .. దివ్యాన్ష కౌశిక్ కథానాయికలుగా సందడి చేయనున్నారు. ఈ సినిమా షూటింగు చాలా వేగంగా జరుగుతోంది. తప్పకుండా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఉద్దేశంతో దిల్ రాజు ఉన్నాడు. ఈ సినిమా సక్సెస్ విజయ్ దేవరకొండకి చాలా అవసరమనేది మాత్రం వాస్తవం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్