Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆహారం - ఆరోగ్యం

ఆహారం – ఆరోగ్యం

Past Food : ఇంట్లో అప్పటికప్పుడు వండుకుని తిన్నది వేడి వేడి అన్నం- పచ్చడి మెతుకులయినా ఆరోగ్యం, క్షేమం, ఆనందం. రోడ్డు మీద తిన్నది అధ్వాన్నం అన్నది లోకంలో ఒక సాధారణ అభిప్రాయం. నిజానికి అధ్వ అంటే దారి. అన్నం అంటే ఆహారం. రెండు పదాలు కలిస్తే తినకూడని, పనికిమాలిన అధ్వాన్నం అయ్యింది. ఎప్పుడో పాతరాతి యుగంలో రాచ్చిప్పల్లో అప్పుడే చెకుముకి రాళ్లతో మంట కనుక్కుని వండుకున్న రోజుల్లో అధ్వాన్నం అంటే తినకూడనిది. ఇప్పుడు దారంతా అధ్వాన్నం చేసి పెట్టే హోటళ్లు, డాబాలు, ఈట్ అవుట్లు, రెస్టారెంట్లు, నక్షత్రాల పూటకూళ్ల ఇళ్లు, బండ్లు, స్టాళ్లు ఉంటాయి. ఊరంతా హోటళ్లే ఉంటాయి. ఎన్ని హోటళ్లు ఉన్నా లోకం మొహం వాచినట్లు ఆబగా తింటూనే ఉంటుంది.

భాషా ప్రేమికులు, వ్యాకరణ పండితులు కూర్చుని అధ్వాన్నం అంటే నెగటివ్ మీనింగ్ కాదని, పరమ పవిత్రమయిన, అత్యంత శుద్ధమయిన స్ఫటికసంకాశ పాజిటివ్ మీనింగ్ అని అర్జంటుగా తేల్చాల్సిన అవసరముంది. లేకపోతే కారులో, బస్సులో, రైల్లో, విమానంలో, రోడ్లమీద, రోడ్లపక్కన, రోడ్ల పైన, రోడ్ల కింద మనం తినే ఏ పదార్థమయినా అక్షరాలా అధ్వాన్నమే అవుతుంది. ఇప్పుడే కాచిగూడ ప్లాట్ ఫామ్ మీద కొంచెం అధ్వాన్నం తిన్నాను. ఇందాక విమానం గాల్లో ఉండగా అర్థంకాని భాషలో అర్థంలేని పేరుతో ఎయిర్ హోస్టెస్ నవ్వుతూ ఇచ్చిన అధ్వాన్నాన్ని నేను ఏడుస్తూ తిన్నాను. రైల్లో ప్యాంట్రీ వాడు ఇచ్చిన రాతిపొరల్లాంటి చపాతీలతో అధ్వాన్నం తిని తిరుమల కొండకు పైకి మెట్లెక్కాల్సినవాడిని, మెట్లెక్కకుండా నేరుగా కైలాసానికే వచ్చేశాను- అని చెప్పుకోవాల్సి వస్తుంది.

ఫ్రిడ్జుల్లో అతిశీతల వాతావరణంలో పాలు, పెరుగు, కూరలు రెండ్రోజులు నిలువ ఉండేమాట నిజమే. కానీ వండుకున్న సకల ఆహార పదార్థాలను ఫ్రిడ్జుల్లో పెట్టి కొద్ది కొద్దిగా వేడిచేసుకుని తినడం మానవ వంటావార్పు నాగరికతలో గొప్ప పరిణామం. ఒకసారి వేడి చేసిన పదార్థం మళ్లీ మళ్లీ వేడిచేస్తే అక్షరాలా బొగ్గుతో సమానమని రసాయన శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా చేసే నిరూపణకు మనం పెద్దగా విలువ ఇవ్వాల్సిన పనిలేదు. అమ్మాయి అన్నప్రాసన రోజు చేయగా మిగిలిన పాయసం- ఆ అమ్మాయి పెళ్లయి అత్తారింటికి పంపేప్పుడు ఫ్రిడ్జులో నుండి తీసి ఒడిబియ్యంతో పాటు, ఒడి పాయసంగా అత్తింటిమీదికి ప్రయోగించవచ్చు. ఫ్రిడ్జులో ఉంటే చాలు. రోజు రోజుకు ఆహారపదార్థాలు తాజాగా మారి, మనం తినడానికి అత్యంత ఆరోగ్యకరమయినవిగా మారిపోతాయని మన నమ్మకం.

ఇళ్లల్లో కనీసం ఏది ఎప్పుడు వండినదో మనకు తెలుస్తుంది. బయట హోటళ్లలో డీప్ ఫ్రీజ్ లలో ఏ కృతయుగారంభంలో దాచిపెట్టినదో చెప్పగలిగిన ఫుడ్ ఇన్ స్పెక్టర్లు ఇంతవరకు పుట్టలేదు. పెద్ద హోటళ్లలో క్యాండిల్ లైట్ డిన్నర్లు అందుకే పుట్టాయి. అంతా చీకటి చీకటిగా ఉంటుంది. దయ్యాల్లా భయం భయంగా చీకట్లో మన కాలు ఇంకొకరికి తగలకుండా మెల్లగా పిల్లిలా వెళ్లి కుర్చీలో కూర్చోవాలి. కూర్చోగానే సింబాలిక్ గా నెత్తిన గుడ్డ వేసినట్లు, మన ఒళ్లో వాడే వస్త్రం వేస్తాడు. ఆ ఆకటి చీకటి వేళలో మనం తింటున్నది మనకు కనపడదు. అధ్వాన్నం తినలేదని మనమనుకుంటాం. హోటల్ వాడు కూడా మనలాగే అనుకోవాలని వాడిని బలవంతపెట్టే అధికారం మనకు ఉండదు.

ఇక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచిది. మురికి కాలువ మురుగునీటి సాక్షిగా ఫాస్ట్ ఫుడ్ బండ్ల మీద సకల చైనా వంటకాలు నూడుల్స్, మంచూరియాలు తయారవుతూ ఉంటాయి. ఇంతకంటే ఫాస్ట్ ఫుడ్ తయారీ, ఆ సెంటర్ల పరిసరాల్లో పరిస్థితుల గురించి లోతుగా వెళ్లడం భావ్యం కాదు. ఎవరికి వారు అనుభవించాల్సిన అనుభవైకవేద్యమయిన ఫాస్ట్ ఫుడ్ వ్యవహారమిది.

అయితే- ఇరవై, ముప్పై ఏళ్లల్లోనే ఇలా వీధి వీధినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వెలిశాయి. ఇదివరకు ఇలా లేదు అని అనుకోవడానికి వీల్లేకుండా- ఇటలీలో రెండువేల సంవత్సరాల కిందటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పురాతత్వ శాఖ తవ్వకాల్లో బయటపడింది.  ఏయే ఆహార పదార్థాలు దొరుకుతాయో బొమ్మలతోపాటు కౌంటర్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేల ఏళ్లుగా వీధుల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయని దీనితో రుజువయ్యింది. మన ఇళ్ల ఫ్రిడ్జుల్లో, హోటళ్లలో కూడా భారత పురావస్తు శాఖ వారు కొంచెం ఓపికగా తవ్వకాలు జరిపితే హరప్పా మొహంజాదారో సింధూ నాగరికతకు ముందు వండి దాచుకున్న అన్నాలో, అధ్వాన్నాలో దొరకకపోవు!

Fast Food

కొన్ని రోజులపాటు పానీ పూరీ తినోద్దని  తెలంగాణా వైద్య శాఖ కార్యదర్శి హెచ్చరించారు. కలుషిత ఆహారం, పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, ఆయా పదార్ధాలతో… వినియోగించే నీటితో ఎక్కువ వ్యాధులు వస్తాయని కాబట్టి ఈ సీజన్ మొత్తం రోడ్లపై పానీ పూరీకి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అయితే  కరోనా తరువాత ఈ ఫాస్ట్ ఫుడ్ కూడా ఇళ్ళల్లోనే తయారు చేసుకోవడం మొదలైంది. నాటి పాతరాతి యుగంలో ఇన్ని దోమలు- వ్యాధులు లేవు కాబట్టి ఏ ప్రమాదాలు లేవు,  ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలకు ఆహారం, నీరు, అపరిశుభ్రత కారణమవుతోన్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఇంటికి, ఒంటికి మంచిది.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

మంచింగ్ మాఫియా

RELATED ARTICLES

Most Popular

న్యూస్