Monday, January 20, 2025
HomeTrending News29 జిల్లాల్లో ఫీవర్‌ సర్వే పూర్తి - మంత్రి హరీష్

29 జిల్లాల్లో ఫీవర్‌ సర్వే పూర్తి – మంత్రి హరీష్

Fever Survey Completed In 29 Districts Minister Harish : 

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రూ.20 కోట్లతో ఏర్పాటు చేసిన క్యాథ ల్యాబ్, ఎమర్జెన్సీ యూనిట్, 100 పడకల ట్రామా కేర్ సెంటర్, తల్లి పాల నిల్వ కేంద్రాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపి నామ నాగేశ్వర్ రావు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రెండో వేవ్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఫీవర్‌ సర్వే దేశానికే ఆదర్శంగా నిలించిందని చెప్పారు.

థర్డ్‌వేవ్‌లో ఫీవర్‌ సర్వేతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఇప్పటివరుకు 29 జిల్లాల్లో ఫీవర్‌ సర్వే పూర్తయిందని చెప్పారు. 77 లక్షల ఇండ్లలో ఫీవర్‌ సర్వే పూర్తిచేశామని, అవసరమైన వారికి మెడికల్‌ కిట్లు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కోటి హోం ఐసోలేషన్‌ కిట్లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. మూడో వేవ్‌లో 86 దవాఖానల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు.

రూ.7.50 కోట్లతో ఖమ్మం దవాఖానలో క్యాథ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే వరంగల్‌ ఎంజీఎంలో క్యాథ్‌ ల్యాబ్‌ అందుబాటులో ఉందని, త్వరలో ఆదిలాబాద్‌ లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గుండె సంబంధిత వ్యాధులకు డాక్టర్లను అందుబాటులో ఉంచామన్నారు. గిరిజన ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అత్యాధునిక సేవలు అందిస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఖమ్మంలో గుండె ఆపరేషన్లు ప్రారంభిస్తామన్నారు. నిలోఫర్‌ దవాఖాన తర్వాత ఖమ్మంలోనే తల్లిపాల నిల్వ కేంద్రం ఉందన్నారు. మధిర, సత్తుపల్లిలో వంద పడకల దవాఖానలు ఏర్పాటు చేస్తామన్నారు.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖమ్మంలో ఎంఆర్‌ఐ సౌకర్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని మార్చురీలను ఆధునీకరించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని చెప్పారు. ఖమ్మం మార్చురీని కూడా ఆధునీకరిస్తామన్నారు. హైదరాబాద్‌ తరహాలో ఖమ్మంలో కూడా బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్‌లో ఖమ్మం జిల్లా ముందంజలో ఉందని చెప్పారు.

జిల్లాలో 103 శాతం మొదటి డోసు పూర్తయిందని, 94 శాతం రెండో డోసు టీకాలు ఇచ్చామన్నారు. 15-17 ఏండ్ల మధ్య వయస్సు వారికి వ్యాక్సినేషన్‌లో కూడా ఖమ్మం అగ్రభాగాన ఉందన్నారు. టీకాలు వేసుకోవడానికి ఎవరు భయపడవద్దని చెప్పారు. రెండో డోసు తర్వాత బూస్టర్‌ డోసు వ్యవధి 6 నెలలకు తగ్గించాలని కేంద్రాన్ని కోరామన్నారు. 60 ఏండ్ల వారితోపాటు ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు కూడా బూస్టర్‌ డోసు వేసుకోవాలని కోరారు.

Also Read : విద్యాసంస్థల ఆరంభంపై హైకోర్టు ఆరా!

RELATED ARTICLES

Most Popular

న్యూస్