గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదేళ్లు పూర్తి చేసుకుని, ఆరో యేట అడుగు పెడుతున్న సందర్భంగా కొండగట్టు ఆలయాన్ని దర్శించుకుని, అటవీ అభివృద్ది పనులకు ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టారు. తొలి దశలో కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో మొత్తం 1,094 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్నారు. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా పనులను ప్రారంభించారు. జే.ఎన్.టీ.యు విద్యార్థులతో కలిసి వెయ్యి మొక్కలు నాటారు.
కొండగట్టును సందర్శించే భక్తులు సేదతీరేందుకు వీలుగా అహ్లాదకరమైన వాతావరణంలో ఫారెస్ట్ పార్క్ ను తీర్చిదిద్దుతామని, మిగతా అటవీ ప్రాంతమంతా పునరుద్దరణకు వీలుగా అటవీ శాఖ చేపట్టే చర్యలకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఎం.పీ నిధుల నుంచి ఒక కోటీ నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలను (104. 85 లక్షలు) కేటాయించారు. అటవీ ప్రాంతానికి రక్షణ కంచె, వాకింగ్ ట్రాక్, వాచ్ టవర్, గజేబోల నిర్మాణం చేపట్టనున్నారు.
గత ఐదేళ్లలో పర్యావరణ రక్షణకు, ప్రకృతి పునరుద్దరణకు పాటు పడటం అత్యంత సంతృప్తిని కలిగించిందని ఎం.పీ సంతోష్ కుమార్ అన్నారు. విచ్చల విడిగా పెరిగిన ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు, కాలుష్యంపై అవగాహన పెంచటం, పలు కార్యక్రమాలను చేపట్టడం ఆరో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రాధాన్యతగా పెట్టుకున్నామని ఎం.పీ ప్రకటించారు.
దేశానికే ఆదర్శంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిలిచిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పర్యావరణ స్పృహను ప్రచారం చేస్తూ, అన్నివర్గాల వారితో మొక్కలు నాటిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ ప్రయత్నం దేశంలో ప్రతీ ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రశంసించారు. సొంత ప్రాంతమైన జగిత్యాల జిల్లాలో, అంజన్న సన్నిధిలో అటవీ దత్తత, అభివృద్ది పనులను చేపట్టిన ఎం.పీ సంతోష్ కుమార్ ను మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు అభినందించారు.
కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎంపీ దామోదర్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుంకే రవి శంకర్, డాక్టర్ సంజయ్ కుమార్, విద్యా సాగర్ రావు, సీఎం సెక్రెటరీ భూపాల్ రెడ్డి, OSD ప్రియాంక వర్గీస్, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, పిసిసిఎఫ్ దొబ్రియాల్, సీసీఎఫ్ శరవణన్, డీ ఎఫ్ ఓ బీవీ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.